నేరడిగొండ, న్యూస్‌లైన్ : మండలంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొక్కుబడిగా మారింది. ఫలితంగా విద్యార్థులు ప్రైవేటు బడి బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 34, టీడబ్ల్యూపీఎస్‌లు 25, జెడ్పీఎస్‌ఎస్‌లు 5, ఎంపీయూపీఎస్‌లు 5, ఆశ్రమ పాఠశాలలు 3, కేజీబీవీ, మినీ గురుకులం ఒక్కొక్కటి ఉన్నాయి. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు. మరికొందరు సమయపాలన పాటించ డం లేదు. స్థానికంగా పదో తరగతి వరకు చదివిన ఒకరిని అనధికారికంగా నియమిస్తూ విద్యాబోధన చేయిస్తున్నారు.
నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తూ తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. పక్షం రోజులకోసారి పాఠశాలకు వెళ్లి రిజిష్టర్‌లో సంతకాలు చేస్తూ తాము నియమించిన వారికి సూచనలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శిస్తే ఏ కారణం చెప్పాలనే విషయమై జాగ్రత్తలు చెబుతున్నారు. మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షణ, తనిఖీలు లోపించడంతో పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఎంఈవోల సమావేశంలో కలెక్టర్ అక్షింతలు వేసినా వారి తీరు మారడం లేదు. దర్భ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఉండగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు మౌలానా విధులకు దూరంగా ఉంటున్నారు. రూ.2వేలు వేతనంగా చెల్లిస్తూ అనధికారికంగా ఓ మహిళను బోధకురాలిగా నియమించారు. ఆమె తన ఇష్టం వచ్చిన సమయంలో పాఠశాల తెరుస్తుండడంతో విద్యార్థుల చదువు అటకెక్కుతోంది. గ్రామస్తులు ఈ విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లినా ఉపాధ్యాయులను వెనకేస్తూ మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది.
వడూర్‌లోని ఉర్దూ ప్రభుత్వ ఎంపీపీఎస్ పనితీరు కూడా అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉండగా 44మంది విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఇద్దరు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించగా ఒక్కరే విధుల్లో చేరారు. ఉపాధ్యాయులు తరచూ పాఠశాలకు రాకపోవడం, అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ మొక్కుబడిగా పాఠశాలకు రావడంతో మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిరోజు ఉదయం విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మధ్యాహ్నం వరకు ఆటలాడి భోజనం చేశాక ఇంటి బాట పడుతున్నారు.