ఉల్లిలొల్లి తగ్గడం లేదు. ధరలు దిగిరాకుండా ఏదో ఒక ప్రతికూలత ఎదురవుతోంది. తగ్గుముఖం పట్టాల్సిన తరుణంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ఉల్లిలొల్లి తగ్గడం లేదు. ధరలు దిగిరాకుండా ఏదో ఒక ప్రతికూలత ఎదురవుతోంది. తగ్గుముఖం పట్టాల్సిన తరుణంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్ర ప్రజల అవసరాలను అధికంగా తీర్చే కర్నూలు ఉల్లికి వైరస్ సోకడంతో సరుకు మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మంచిగా ఉన్న కొద్దిపాటి సరుకుకు డిమాండ్ ఏర్పడడంతో ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్నూలు ఉల్లికి ప్రధాన మార్కెట్ తాడేపల్లిగూడెం. కర్నూలులో మార్కెట్ ఉన్నప్పటికీ ఆ జిల్లా రైతులు తమ పంటను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తీసుకువచ్చే విక్రయిస్తూఉంటారు. 15 రోజుల క్రితం వరకు కర్నూలు ఉల్లికి మంచి ధర లభించడంతో రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది.
వరుసగా వచ్చిన అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు వారి ఆనందంపై నీళ్లు చల్లాయి. వర్షాలు ప్రారంభమైన రెండురోజులపాటు మార్కెట్‌కు తడిసిన ఉల్లి వచ్చినా మంచి ధరకు వెంటనే అమ్ముడయింది. వర్షాలు కురుస్తున్న కారణంగా వైరస్ సోకి ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండడం లేదు. రెండు మూడు రోజులకే కుళ్లిపోతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కర్నూలు నుంచి సరుకులు వచ్చినా రైతుకు ఆశించిన మేరకు ధర రావడం లేదు. గత ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 200 లారీల సరుకు రాగా, రూ.40 ధర పలికింది. ఈ ఆదివారం 70 లారీలు మాత్రమే రావడంతో రిటైల్ మార్కెట్‌కు ధర రూ.55కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆప్ఘనిస్థాన్ నుంచి దిగుమతి
తాడేపల్లిగూడెం మార్కెట్‌లో మహారాష్ర్ట ఉల్లి జాడే కన్పించడం లేదు. అక్కడి మార్కెట్‌లోనే ఉల్లికి క్వింటాల్ ధర రూ.5,500 పలుకుతోంది. ఇక్కడకు తీసుకురావాలంటే రవాణా ఖర్చుల భారం మరో 500 పడుతుండడంతో రైతులు అక్కడే విక్రయిస్తున్నారు. గుత్త మార్కెట్‌లోనే క్వింటాలు రూ. 6 వేలు కావడంతో, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.70 అమ్మితేగానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. దీంతో మహారాష్ట్ర ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావడం లేదు. ఉల్లి అవసరాలను తీర్చుకోడానికి చైనా, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి దిగుమతికి ఇక్కడి వ్యాపారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్టు పట్టణానికి చెందిన నాఫెడ్‌లో సభ్యత్వం కలిగిన వ్యాపారి ఒకరు తెలిపారు. దేశంలోని మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల మార్కెట్లలో ఉల్లి ధర మండిపోతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికంగా క్వింటాలు ఉల్లి ధర రూ.8 వేల వరకు ఉండగా, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, నాగాలాండ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో క్వింటాలు రూ.3,500 నుంచి రూ.7,500 వరకు పలుకుతోంది. కొత్త సరుకు మార్కెట్‌కు వచ్చే వరకు ఉల్లి లొల్లి తగ్గేలా కన్పించడం లేదు.