విభజన బిల్లు దురదృష్టకరం: విజయమ్మ
హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు ముందే ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చ జరిగితే దాని అర్థం విభజనకు అంగీకరించినట్లేనని ఆమె అన్నారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే విజయమ్మ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు.
తమ పార్టీ ఎప్పటికి సమైక్యాంధ్రానే కోరుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోరాదని, విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలన్నారు. బెంగాల్ విభజన సమయంలో అసెంబ్లీ తీర్మానానికి విలువ నిచ్చారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ అభ్యంతరంతో విభజనను ఆనాడూ నిలిపివేశారన్నారు.
కేంద్రం ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేయరాదన్నారు. విభజనకు ఓ విధానం ఉండాలి తప్ప, అడ్డగోలుగా విభజన తగదన్నారు. తాము చివరివరకూరాష్ట్రం సమైక్యంగా ఉండేందుకే కట్టుబడతామని విజయమ్మ స్పష్టం చేశారు. విభజనకు తాము వ్యతిరేకమని...సమైక్యాంధ్రతో అభివృద్ధి సాధ్యమన్నారు. కీలకమైన సమయంలో ముఖ్యమంత్రి కానీ, ప్రధాన ప్రతిపక్ష నేతకానీ సభలో ఉండరని విజయమ్మ అన్నారు.