'బిల్లుపై ఓటింగ్ ఉంటుందో...లేదో చెప్పలేను'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ ఉంటుందో... లేదో కూడా చెప్పలేనని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బిల్లుపై క్లాజులవారిగా లేదా.... మొత్తం బిల్లుపైన ఓటింగ్ ఉంటుందో..లేదో కూడా చెప్పలేనని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు గురువారం స్పీకర్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ గతంలో వైఎస్ విజయమ్మ ఇచ్చిన తీర్మానం నోటీసు.. ఓటింగ్ జరపాలంటూ విజయమ్మ రాసిన లేఖపై.. ప్రకటన మాత్రమే చేయగలన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు క్లాజులకు సవరణలు ప్రతిపాదించి, డివిజన్ అడిగితే ఓటింగ్ నిర్వహించక తప్పదని స్పీకర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సవరణలు ప్రతిపాదించటంతో పాటు డివిజన్ అడిగే హక్కు సభ్యులకు ఉంటుందని, దాన్ని కాదనలేవని మంగళవారం ఆయన పేర్కొన్నారు.