అప్పుడే విస్తృత చర్చకు అవకాశం: అశోక్‌బాబు
విభజన బిల్లు ప్రతులను ప్రజా సంఘాలకు కూడా ఇవ్వాలని ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు డిమాం డ్ చేశారు. తద్వారా విస్తృత చర్చకు అవకాశం ఉంటుం దన్నారు. ఇక్కడ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో బిల్లు చర్చకు వస్తుందా? లేదా? అన్నది కూడా సందిగ్ధమేనన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన వెంటనే ఆందోళన చేపడతామన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే హైదరాబాద్ వచ్చిన డిగ్గీ రాజాను ‘గో బ్యాక్’ అంటూ తాము చేసిన ఆందోళనకు కాంగ్రెస్ నేతలు హర్షం ప్రకటించారని తెలిపారు. ‘‘డిగ్గీ రాజా రావడం దుశ్శకునంగా భావిస్తున్నాం. బిల్లును వ్యతిరేకించాల్సిందిగా సభ్యులను కోరుతున్నాం. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో బిల్లు పెడదామనుకున్న ఢిల్లీ నేతల్లో కూడా ఆశలు పోయాయి’’ అని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంఘం ఎన్నికలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఈ సారి సమ్మె చేస్తే చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. బిల్లుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు.