హైదరాబాద్ మాదే.. యూటీగా వద్దు | Telangana Congress Leaders Oppose Union Territory Status to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మాదే.. యూటీగా వద్దు

Published Tue, Aug 20 2013 2:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Telangana Congress Leaders Oppose Union Territory Status to Hyderabad

* ఆంటోనీ కమిటీతో కాంగ్రెస్ టీ-నేతలు
* ఉమ్మడి రాజధానిగా కూడా ఒప్పుకోం
* శాంతిభద్రతలను కేంద్రం తీసుకుంటే అభ్యంతరం లేదు
* రాయల తెలంగాణకూ ఒప్పుకునేది లేదు.. మా సంస్కృతులు వేర్వేరు
* పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి... ప్రక్రియలో వేగం పెంచాలి
* నదీ జలాల పంపిణీపై రెగ్యులేటరీ అథారిటీ హామీ ఇస్తే సరిపోతుంది
* సీమాంధ్ర ఉద్యమం వెనుక రాష్ట్ర పెద్దలు.. సీఎం, డీజీపీలపై ఆరోపణలు
* అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై ప్రత్యేకంగా చర్చించిన ఆంటోనీ కమిటీ
 
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో లేక శాశ్వత ఉమ్మడి రాజధానిగానో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంటోనీ నేతృత్వంలోని కాంగ్రెస్ కమిటీకి స్పష్టంచేశారు. కావాలంటే హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో శాంతిభద్రతలను పూర్తిగా కేంద్రం అజమాయిషీ కిందకి తెస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నేతలంతా ముక్తకంఠంతో తోసిపుచ్చారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు మాత్రమే తమకు సమ్మతమని తేల్చి చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇదే సమయంలో సీమాంధ్రలో ఆందోళనలను అదుపులోకి తెచ్చేలా వారికి త్వరగా రాజధాని, ప్యాకేజీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సీమాంధ్ర ఉద్యమం వెనుక పూర్తిగా రాష్ట్ర పెద్దలు ఉన్నారని, జాతీయ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా అక్కడి పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు కమిటీ ఎదుట ఆరోపించినట్లు సమాచారం.

రాష్ట్ర విభజనపై సీమాంధ్రులు పలు అభ్యంతరాలు లేవనెత్తుతున్న తరుణంలో ఆంటోనీ కమిటీ సోమవారం రాత్రి తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయింది. ఈ సందర్భంగా.. విభజనలో నీటి పంపకాలు, హైదరాబాద్ అంశం, ఉద్యోగులు, విద్యార్థుల భద్రత, రాయల తెలంగాణ అంశం తదితరాలపై చర్చించారు. అలాగే.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో కమిటీ ప్రత్యేకంగా సమావేశమై.. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలిసింది.

ఎంసీహెచ్ పరిధి కేంద్ర అజమాయిషీ ఓకే..
హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని.. మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ సీమాంధ్రులు వినిపిస్తున్నారని కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ప్రస్తావించినట్లు సమాచారం.

దీనికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌ను సీమాంధ్రులు అభివృద్ధి చేశారనటం అవాస్తవం.. అక్కడ వారు చేసిందేమీ లేదు. అక్కడ వనరులను, అవకాశాలను వాడుకొని బాగుపడ్డారంతే. హైదరాబాద్‌లో రాజస్థాన్, సూరత్, మహారాష్ట్ర ప్రజలూ ఉన్నారు. వారికి లేని అభద్రత సీమాంధ్రులకు అక్కర్లేదు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారని.. ఎంసీహెచ్ పరిధిలో శాంతిభద్రతలను కేంద్ర అజమాయిషీ కిందకు తెస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం.

రాయల తెలంగాణకు నో..
రాయల తెలంగాణ అంశాన్ని మరోమారు దిగ్విజయ్‌సింగ్ ప్రస్తావిస్తూ.. రాయలసీమలోని రెండు వెనకబడిన జిల్లాలను తెలంగాణలో కలిపితే నదీ జలాల అంశం పరిష్కారమవుతుంది కదా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి నేతలంతా మూకుమ్మడిగా అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ‘సీమ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ప్రజల మనస్తత్వం పూర్తిగా సౌమ్యంగా ఉంటే వారు అందుకు భిన్నంగా ఉంటారు’ అని యాదవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కర్నూలు, అనంతపురం జిల్లాలు గతంలో తెలంగాణలో భాగమే కదా? అని దిగ్విజయ్ ప్రశ్నించగా.. దామోదర స్పందిస్తూ ‘1799లో టిప్పుసుల్తాన్ యుద్ధ సమయంలో తెలంగాణలో భాగంగా ఉన్న బళ్లారి, కర్నూలు, అనంతపురం, కడపలను సీడ్ చేశారు. ఇది జరిగి 200 ఏళ్లు గడిచింది. కాబట్టి వారికి, తెలంగాణ వారికి వైరుధ్యాలు అనేకం ఉన్నాయి’ అని చెప్పినట్లు తెలిసింది. సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే అంతా కోరుతున్నారని స్పష్టంచేసినట్లు సమాచారం.

అలాగే.. నదీ జలాల వివాదాలకు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగాయని, ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయని భావిస్తే, రెగ్యులేటరీ అథారిటీ ద్వారా వాటిని పరిష్కారిస్తామని కేంద్రం వారికి బిల్లు సమయంలోనే హామీ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ తీరును కమిటీ వద్ద టీ-నేతలు తప్పుపట్టిన ట్లు సమాచారం. అక్కడ రాజీవ్, ఇందిర విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా సీఎం పట్టించుకోవటం లేదని, ఆందోళనలకారులు విచ్చలవిడిగా చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం చేతులు క ట్టుకుని చూస్తోందని ఆరోపించినట్లు తెలిసింది. దిగ్విజయ్ స్పందిస్తూ అక్కడి పరిణామాలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.

ఎవరు వస్తే వారి వాదనలు వింటాం: దిగ్విజయ్
పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు బిజీగా ఉన్నందున హైదరాబాద్‌లో సమావేశం పెట్టలేకపోయామని దిగ్విజయ్‌సింగ్ భేటీ అనంతరం మీడియాతో పేర్కొన్నారు. ‘ఇలాంటి సమావేశం హైదరాబాద్‌లో జరగాల్సింది. అయితే పార్లమెంటులో సమావేశాల్లో మొయిలీ, ఆంటోనీ బిజీగా ఉన్నారు. అందువల్లఅక్కడికి వెళ్లలేకపోయాం. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇక్కడకు పిలిపించాం. వారి వాదనలు విన్నాం. రేపు కూడా ఈ సమావేశం జరుగుతుంది’ అని చెప్పారు. మంగళవారం ఎవరని పిలుస్తారు అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘నువ్వైనా రావచ్చు. ఎవరు వస్తే వారి వాదనలు వింటాం’ అని ఆయన బదులిచ్చారు.

యూటీగా ఒప్పుకోం: ఉత్తమ్, గీతారెడ్డి
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకునేది లేదని మంత్రులు గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు స్పష్టంచేశారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్కడ ఉన్న ఇతర ప్రాంతాల వారి మాదిరే సీమాంధ్రులకు భద్రత ఉంటుందని తాము భరోసా ఇస్తున్నామన్నారు.

ఆంటోనీ కమిటీతో భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మధ్యలో వచ్చిన ఎంపీ రేణుకాచౌదరి సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement