
సీఎం ఏమైనా పెద్ద మొనగాడా: డీఎస్
తెలంగాణ ప్రక్రియను అడ్డుకోడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా పెద్ద మొనగాడా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, మంత్రి సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా దానికి కట్టుబడి ఉంటానని చెప్పి.. ఇప్పుడు తెలంగాణ ప్రక్రియను అడ్డుకోడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా పెద్ద మొనగాడా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, మంత్రి సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో గురువారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. తెలంగాణ ప్రక్రియను అడ్డుకోవడం సరికాదని వారు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంతం వారి కృషి కూడా ఉందని, అయితే అంత మాత్రాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముందొక మాట, వెనకొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
మరోవైపు.. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 29వ తేదీ తరువాత ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు.