సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శనం లభించింది. పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, కుంజా సత్యవతి బుధవారం ఉదయం సోనియాను ఢిల్లీలోని ఆమె నివాసమైన 10జన్‌పథ్‌లో కలిశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేయబోతున్న కాంగ్రెస్ అధినాయకురాలిని కలిసి ఖమ్మం జిల్లా ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేశామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందున జిల్లా ప్రజానీకమంతా రుణపడి ఉంటామని సోనియాకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
అంతకు ముందు వీరంతా తెలంగాణ బిల్లుపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం సభ్యుడు జైరాంరమేశ్‌ను కలిశారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రాంతంలో కలపవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు గ్రామాలను కూడా సీమాంధ్రలో కలిపేందుకు అక్కడ నివసించే ప్రజలు అంగీకరించడం లేదని జైరాంకు తెలియజేశారు.