సోనియా కాళ్లపై పడిన విషయం మర్చిపోకు | forget the work of sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియా కాళ్లపై పడిన విషయం మర్చిపోకు

Published Wed, Jun 10 2015 5:15 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా కాళ్లపై పడిన విషయం మర్చిపోకు - Sakshi

సోనియా కాళ్లపై పడిన విషయం మర్చిపోకు

- నలుగురి చేతుల్లో తెలంగాణ నలుగుతోంది
- తాగుబోతులను మరిపిస్తున్న కేసీఆర్ మాటలు
- సోనియాను విస్మరించడం ద్రోహమే
- సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క
వరంగల్/వరంగల్ అర్బన్ :
తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాళ్లపై పడిన రోజులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు మర్చిపోవద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. వరంగల్‌లోని మహేశ్వరీ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన పార్టీ జిల్లా ముఖ్యకార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కులం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు పుట్టుకొచ్చాయని, దేశం కోసం ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నేరవేర్చిందన్నారు.

తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన ఫలాలు నలుగురు దక్కించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ కేసీఆర్, కే టీఆర్, హరీష్‌రావు, కవిత నలుగురి మధ్యనే నలుగుతోందన్నారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ నేతలను, ఇచ్చిన సోనియాను విస్మరించడం ద్రోహమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టడం సారాయి దుకాణంలో పొద్దంతా తాగిన తాగుబోతు నిలువెల్లా నిషతో తిట్టిన విధంగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిమాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచినా ద్రోహులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల్లో జిల్లాలోని పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోలేదని సొంత పార్టీలోని కొందరు పందికొక్కుల కుట్రల ఫలితంగా చాలామంది ఓటమిని చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బఫూన్ వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోసం చేయలేదని, నేతలే అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ఒకేపార్టీ ఉండాలన్న దుష్టబుద్ధి సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసేవారికే వచ్చే ఉపఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలన్నారు.

డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ మంత్రులు విజయ రామారావు, బొచ్చు సమ్మయ్య, ఆరోగ్యం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్,పోడెం వీరయ్య, ఆరేపల్లి మోహన్, సమ్మయ్య, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు దామోదర్, డాక్టర్ హరిరమాదేవి, జయ ప్రకాశ్, బండా ప్రకాశ్, మీడియా ఇంచార్జ్ ఈవీ.శ్రీనివాసరావు, మహమూద్, చందుపట్ల ధనరాజ్, వీసం సురేందర్‌రెడ్డి, బాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని జిల్లా పార్టీ పక్షాన ఘనంగా సన్మానించారు.  అనంతరం దాశరథి రంగాచార్య మృతికి నిమిషంపాటు మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు.

స్థానిక మాదిగ యువకులకే
ఎంపీ టికెట్ ఇవ్వాలి
కాజీపేట :
గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులను కాకుండా స్థానికుడు మాదిగ కులానికి చెందిన వ్యక్తికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని జిల్లాకు చెందిన దళిత నాయకులు సీఎల్‌పీ ఉప నాయకుడు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి కాజీపేట సిదార్థనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగారపు అమృతరావు ఇంట్లో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్వర్యంలో ఎస్సీ నాయకులు రహస్య సమావేశశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో మాజీ మంత్రులు, డాక్టర్ గుండె విజయరామారావు, బొచ్చు సమయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే భువనగిరి ఆరోగ్యం, నాయకుడు రాజారపు ప్రతాప్ పాల్గొన్నారు.

తుపాకీ రాముడిలా కేసీఆర్ పాలన
జనగామ రూరల్ :
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి సీఎం కేసీఆర్ తుపాకి రాముడిలా పాలన సాగిస్తున్నాడని, ఏడాది పూర్తయినా ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లూ భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్‌కు వెళుతున్న ఆయన మార్గమధ్యలో ఉన్న జనగామలోని టీపీసీసీ చీఫ్ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రజలను వంచిస్తుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement