సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే రాయల తెలంగాణ ప్రతిపాదన అని, దీన్ని తాము ఒప్పుకోబోమని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుటిల నీతికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. నాటి కేంద్రప్రభుత్వం-నిజాంనవాబు, రజాకార్లతో యథాతథ స్థితి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టే నేడు సోనియా, మజ్లిస్‌తో ఒప్పందానికి వచ్చారన్నారు.
మేం కోరుతున్నది తెలంగాణ మాత్రమే: గండ్ర
స్వయంపాలన కోసమే తామంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామే తప్ప రాయల తెలంగాణ కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుతుంటే రాయల తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మూడు రోజుల గడువు ఇచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
దురుద్దేశాలతోనే రాయల తెలంగాణ : ఈటెల
గోదావరిఖని, న్యూస్‌లైన్: దురుద్దేశాలతోనే రాయల తెలంగాణను కాంగ్రెస్‌పార్టీ తెరమీదకు తెచ్చిందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సోమవారం టీబీజీకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. బిల్లు పెట్టకుండా, కాలయాపన చేస్తుండడం వల్లే రాయల తెలంగాణ వంటి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
కేసీఆర్ వల్లే ‘రాయల’ ప్రతిపాదన: ఎంపీ రాథోడ్
మంచిర్యాల, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ వల్లే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని ప్రకటించి జాప్యం చేయడవం వల్లనే కాంగ్రెస్ రాజకీయ లబ్దికోసం కోసం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు.
రాయల పేరుతో కాంగ్రెస్ కుట్ర: ఎర్రబెల్లి
పాలకుర్తి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకురావడంలో కుట్ర దాగి ఉందన్నారు.
‘రాయల’ ఆమోదిస్తే ఉద్యమం: టీజేఎఫ్
హైదరాబాద్,న్యూస్‌లైన్: రాయలతెలంగాణ ప్రతిపాదన చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సోమవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 4న జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాయల తెలంగాణ అంటే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు.
5న విద్యాసంస్థల బంద్: శ్రీనివాస్ మాదిగ
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న తెలంగాణ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
తెలంగాణ కోసం 6న టీసీఎంజీ చలోఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నిర్ణయించింది. ఈనెల 6న ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు అక్కడే మకాం వేయాలని తీర్మానించింది. సోమవారం రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ నివాసంలో సారథ్య బృందం నాయకులు జి.నిరంజన్, బి.కమలాకరరావు, నర్సింహారెడ్డి, శ్యాంమోహన్, డాక్టర్ శంకర్, బొల్లు కిషన్ తదితరులు సమావేశమై యాత్ర గురించి చర్చించారు.
రాయల తెలంగాణకు ఒప్పుకోం: విద్యాసాగర్‌రావు
Published Tue, Dec 3 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement