బాలరాజుకు పలువురి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ఏపీఎన్జీఓల దాడీలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఎస్ జేఏసీ కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. డ్యూటీ డాక్టర్ ద్వారా వివరాలు తెలుసుకొని, బాలరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సహా ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు యాదవ్ తదితరులు బాలరాజును పరామర్శించారు. దాడి సంఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఉన్నత స్థాయి విచారణకు కృషి చేస్తానని మంత్రి అరుణ చెప్పారు.
ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన మంత్రి జానారెడ్డిని జేఏసీ నేతలు నిలదీశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నందున సంయమనం పాటించాలని సూచించారు. టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా, ఆదిత్య ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థి ప్రశాంత్‌ను కూడా పలువురు నేతలు పరామర్శించారు. పోలీసుల తోపులాటలో నిజాం కాలేజీ హాస్టల్ బాల్కనీ నుంచి కిందపడడంతో ప్రశాంత్ చేయి విరిగిన విషయం తెలిసిందే.