పదవుల్లేవు... పైసలొచ్చే పనుల్లేవు..!
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలంగాణ టీడీపీలో నేతలను ఒక తాటి మీదకు తీసుకువచ్చేందుకు పార్టీ అధినాయకత్వం ఆపసోపాలు పడుతోంది. పెదబాబు.. చినబాబులు వరసగా సమావేశాలు పెడుతున్నా పెద్దగా ప్రయోజం ఉండడం లేదన్నది తమ్ముళ్ల ఆవేదన. తెలంగాణలో పార్టీని బతికించుకుందామని హై కమాండ్ నానా తిప్పలు పడుతున్నా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదంటున్నారు. దీనికి పెద్దగా తలలు బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన పని లేదని, తెలంగాణ నేతల గొంతెమ్మ కోర్కెల చిట్టా కొండపల్లి చాంతాడంత ఉండడం... అధినేత ఆ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వరస సమావేశాలు నిరుపయోగం అవుతున్నాయంటున్నారు. మరో వైపు పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందన్నది ఇంకో వాదన.
వ్యక్తిగత ప్రతిష్ట కోసం నానా తిప్పలు పడుతున్న ఓ నేత సీనియర్లను కాదని కాలరెగరేయడం కూడా సమస్యగా మారిందని ఓ తెలుగు తమ్ముడు వాపోయాడు. పదవుల్లేవు.. పైసలొచ్చే పనుల్లేవు.. వెంటొచ్చే జనాలు లేరు.. మీటింగులు ఈటింగులతో ఏమైతదని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని అధినేత పడుతున్న తాపత్రయం నేతలకు పట్టడం లేదంటున్నారు. నేతల గొంతెమ్మ కోర్కెలు తీరిస్తే కానీ పరిస్థి తి పట్టాలు ఎక్కేలా లేదని ఓ సీనియర్ నేత తన అనుభవాన్నంతా రంగరించి మరీ చెబుతున్నారు..!