తణుకు అర్బన్, న్యూస్‌లైన్ :
హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హాజరైన ‘పశ్చిమ’ ఏపీఎన్జీవోలు ఆదివారం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలోనూ అడుగడుగునా తెలంగాణవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీమాంధ్ర భవిష్యత్ కోసం ప్రాణాలకు తెగించి ముందుకు సాగినట్లు ఉద్యోగులు తెలిపారు. సభ పూర్తిస్థాయిలో సక్సెస్ కావడంతో తెలంగాణవాదులు ఉక్రోషాన్ని ఆపుకోలేక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సభకు తణుకు నుంచి 5 బస్సులో ఏపీఎన్జీవోలు వెళ్లారు. హైదారాబాద్ నుంచి తిరిగివస్తుండగా చౌటుప్పల్ వద్ద తెలంగాణవాదులు చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు.
బస్సులపై జరిగిన రాళ్ల దాడిలో వైవీ సత్యనారాయణమూర్తి, కొమరవరం వీఆర్వో ఏజేబీవీ నారాయణ, ఎస్ ఇల్లింద్రపర్రు వీఆర్వో వి.ముత్యాలరావు, బస్సు డ్రైవర్ వీరింకి ఏడుకొండలు గాయపడ్డారు. నారాయణకు నుదుటిపై తీవ్ర గాయం కావడంతో ఏడు కుట్లు, ముత్యాలరావుకు చెవికి గాయమై ఐదు కుట్లు పడినట్లు ఎన్జీవోలు చెప్పారు. ఎన్జీవోలు వైవీ సత్యనారాయణమూర్తి, పితాని వెంకటరమణ మాట్లాడుతూ సభను అడ్డుకునేందుకు తెలంగాణలో బంద్ ప్రకటించిన కోదండరాం, కేసీఆర్, హరీష్‌రావులే ఈ దాడులకు కారణమని ఆరోపించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దాడులకు పాల్పడినవారిని ఎన్జీవోల నాయకులు తెలంగాణ పోలీసులకు చూపించినా పట్టించుకోలేదన్నారు. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సుపై అకస్మాత్తుగా జరిగిన రాళ్లదాడిలో బస్సు డ్రైవర్ వీరంకి ఏడుకొండలు గాయపడినా చాకచక్యంగా బస్సును నిలువరించడంతో బస్సులో ఉన్న 40 మంది ఎన్జీవోలు సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు.
ఎన్జీవోలకు పలువురి పరామర్శ
గాయపడిన ఎన్జీవోలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య పరామర్శించారు. పైడిపర్రు ఆర్వోబీ ప్రాంతంలో బస్సులను ఆపి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సభ సక్సెస్‌పై అభినందనలు తెలిపారు. తహసిల్దార్ ఎం.హరిహర బ్రహ్మాజీ, జేఏసీ నాయకులు ఎన్జీవోలను పరామర్శించారు.
ఊపిరి పీల్పుకున్న కుటుంబ సభ్యులు
చింతలపూడి: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు వెళ్లిన చింతలపూడి ఏపీ ఎన్‌జీవోలు ఆదివారం సురక్షితంగా తమ ప్రాంతానికి చేరడంతో వారి కుటుంబ సభ్యులు ఊపీరి పీల్చుకున్నారు. శుక్రవారం రాత్రి చింతలపూడి నుంచి ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై ఖమ్మం జిల్లా మండాలపాడు గ్రామం వద్ద రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. సభ జరగకూడదని తెలంగాణవాదులు తమపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినా సీమాంధ్ర భవిష్యత్ కోసం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఉద్యోగులు తెలిపారు. సదస్సులో సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మేథావుల ప్రసంగాల ద్వారా తెలుసుకునే వీలు కలిగిందని చెప్పారు.
ఉక్రోషంతో దాడులు
Published Mon, Sep 9 2013 12:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement