ఆంక్షలు లేని తెలంగాణ : కెసిఆర్
హైదరాబాద్: తమకు ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర మంత్రుల బృందానికి తెలిపినట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. జిఓఎంతో టిఆర్ఎస్ నేతల సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాల విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయో అలాగే ఉండాలని చెప్పినట్లు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో గానీ, ఇతర అంశాల విషయంలో గానీ తెలంగాణపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదన్నారు.
హైదరాబాద్ అయిదేళ్లే ఉమ్మడి రాజధానిగా ఉండాలని తాము చెప్పినట్లు తెలిపారు. డిసెంబరులో తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. డిమాండ్ లేకుండా దీక్ష చేసిన గొప్ప నేత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. అఖిల పక్ష సమావేశానికి ఎందుకు రాలేదో చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు.
ఢిల్లీలో ఈరోజు కలవడానికి చాలామంది నాయకులు అందుబాటులో లేరని, పార్లమెంటు సమావేశాలకు ముందు వచ్చి అందరిని కలుస్తానని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అందరి మద్దతు కోరతామన్నారు.