
సాక్షి, విజయవాడ: వంగవీటి రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు టెలీ సీరియల్ నిర్మించనున్నట్లు సినీ నటుడు జి.వి.సుధాకర్‌నాయుడు ప్రకటించారు. ప్రజల గుండెల్లో ఉన్న ఆయన గురించే ఈ సీరియల్ ఉంటుందన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్కులో గల ఆయన విగ్రహానికి జీవీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీరియల్‌లో అన్నీ వాస్తవాలే ఉంటాయన్నారు. ఇందుకు దేవినేని అనుమతి అవసరం లేదని, అభ్యంతరాలు చెబితే వారిని కూడా కలుస్తానని చెప్పారు.
వర్మ తనకున్న మేథాశక్తి మేరకే వంగవీటి సినిమా తీశారని, అందులో కొన్ని తీశారు.. కొన్ని దాచారని అన్నారు. వర్మ దగ్గర మరో సినిమా ఉందంటూ అది ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవాలు కటువుగా ఉంటాయి.. అందరి పేర్లు పెట్టే సీరియల్ చేస్తాను.. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని వ్యాఖ్యానించారు. దాసరి నారాయణరావు నా గురువు.. వంగవీటి రంగాపై సినిమా తీయాలని ఆయన చివరి దశలో నన్ను కోరారని చెప్పారు. రంగా చరిత్ర మొత్తం ఆరున్నర గంటలపాటు చిత్రీకరించాల్సి ఉందని, అందుకే సినిమాగా కాక టెలీ సీరియల్‌గా తీస్తున్నామని, 150 ఎపిసోడ్ల వరకు ఉంటుందని జీవీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment