టీ కాంగ్రెస్‌వి అర్థం లేని ఆరోపణలు: గట్టు
కేసీఆర్‌తో అన్ని విధాలా అంటకాగింది కాంగ్రెస్ నేతలేనని విమర్శ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. నోరుందని ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం సరికాదని హితవు పలికారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు మీడియాతో మాట్లాడుతూ.. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో, సీమాంధ్రలో జగన్‌మోహన్‌రెడ్డి విజయబావుటా ఎగురవేయడం అంతే సహజమని చెప్పారు. సీమాంధ్రలో జగన్ సీఎం అవుతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం మీడియా సమావేశం పెట్టి మరీ జగన్, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందమంటూ ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న మొన్నటి వరకూ కేసీఆర్‌తో అన్ని విధాలా అంటకాగింది కాంగ్రెస్ వారేనని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్, జగన్ భిన్న ధృవాలని, వారి మధ్య లేని సంబంధాల ను తేవద్దని కోరారు. రాష్ట్ర విభజన జరగాలంటూ ఒకరు, వద్దని మరొకరు పోరాటాలు చేశారన్నారు. టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ రెండు వేర్వేరు ప్రజా ప్రయోజనాలతో పోరాటం చేస్తున్న పార్టీలని, వీటి మధ్య ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవన్నారు. దుర్మార్గమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి రా వాలని వైఎస్సార్ సీపీ కోరుకుంటుందనీ, వైఎస్ పథకాలను అమలు చేయాలని కేసీఆర్‌పైనా ఒత్తిడి తెస్తామన్నారు.