198 చిత్రాల్లో నటించా..
భీమవరం : స్వచ్ఛంగా గలగలపారే గోదావరి, మైమరిపించే ప్రకృతి అందాలను సొంతం చేసుకున్న గోదావరి తీరాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని సినీ నటి జమున అన్నారు. భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పాలకొల్లు, నరసాపురం పరిసరాల్లో చిత్రీకరించిన మూగమనసులు చిత్రం తెలుగు, హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచి తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు.
198 చిత్రాల్లో నటించా..
తాను ఇప్పటివరకు 198 చిత్రాల్లో నటించానని జమున తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు ఉన్నాయన్నారు. ఎన్టీ రామారావుతో 30 చిత్రాల్లో నటించగా ఏఎన్‌ఆర్, రాజకుమార్ వంటి హీరోలతో నటించిన చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయని చెప్పారు.
సత్యభామగా పేరొచ్చింది
సాంఘిక సినిమాల్లో ‘మూగమనసులు’, పౌరాణిక చిత్రాల్లో ‘సత్యభామ’ మంచిపేరు తెచ్చిపెట్టాయని జమున అన్నారు. వ్యక్తిగతంగా ‘పండంటి కాపురం’ చిత్రంలోని రాణిమాలినిదేవి పాత్ర సృంతప్తి నిచ్చిందన్నారు.
25 ఏళ్లు హీరోయిన్‌గా..
చిత్రసీమలో 25 ఏళ్లపాటు కథానాయికిగా నటించడం పుర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని జమున తెలిపారు. ప్రస్తుత నటులు అయిదారు సినిమాలకు పరిమితం కాగా తాను అన్నేళ్లపాటు నటిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
పేద కళాకారులకు చేయూత
సినీ, నాటక రంగంలో పేద కళాకారులకు సేవా చేయాలనే సంకల్పంతో జమున పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేశానని చెప్పారు. ద్రాక్షరామసమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటుచేస్తానన్నారు. దీనికి 1,000 గజాల స్థలం కేటాయించామని వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
సినీ రంగం వ్యాపార మయం
ప్రస్తుతం సినీ పరిశ్రమ వ్యాపార రంగంగా మారిందని జమున ఆవేదన వ్యక్తం చేశారు. యువతను పెడదోవ పట్టించేలా ఎక్కువగా సినిమాలు వస్తున్నాయని, అశ్లీలత ఎక్కువవుతోందన్నారు. టీవీల వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటుందనే వాదన సరైంది కాదని చెప్పారు. మంచి సినిమాలను థియేటర్లలలో చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
సన్మానం పూర్వజన్మ సుకృతం
సినీ నటిగా తాను పలు సన్మానాలు అందుకున్నా భీమవరం మావుళ్లమ్మ వారి సన్నిధిలో సత్కారం అందుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని సినీ నటి జమున అన్నారు. ఆదివారం రాత్రి మావుళ్లమ్మ ఆలయం వద్ద కొటికలపూడి గోవిందరావు కళావేదికపై నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జమునను ఘనంగా సన్మానించారు. గోదావరి ప్రాంత ప్రజలకు ఉదార స్వభావం మెండుగా ఉంటుందని, ఇన్నేళ్లుగా తనపై చూపుతున్న ఆదరాభిమానాలే ఇందుకు నిదర్శనమన్నారు. లక్షలాది రూపాయలతో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడంతో పాటు కళాకారులను సత్కరించడం అభినందనీయమన్నారు.