సాక్షి, అమరావతి: సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు సినీతారలను తరలించి వ్యభిచారం ఊబిలోకి దింపిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అమెరికాలోని చికాగో పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఇది కేవలం సినీతారలకు సంబంధించిన అంశంగానే భావించినప్పటికీ ఈ రాకెట్‌లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమనను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా విచారించడం కలకలం రేపుతోంది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్ పంపడంతోపాటు సతీష్ వేమన బ్యాంకు ఖాతా నుంచి సినీతారలకు పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లాయని ఎఫ్‌బీఐ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించినట్టు తెలిసింది.
టీడీపీలో సతీష్ చురుకైన పాత్ర
తొలుత ఎఫ్‌బీఐ విచారణకు హాజరైన సతీష్ వేమన తరువాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిసింది. అయితే తానా ప్రతినిధులపై పోలీసులు ఒత్తిడి తేవడంతో సతీష్ విచారణకు హాజరై సహకరించారని చెబుతున్నారు. సినీతారల సెక్స్ రాకెట్‌కు సంబంధించి సతీష్ వేమన ప్రమేయంపై ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ ఆరా తీసినట్టు సమాచారం.
టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సతీష్ గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు హీరోయిన్లను అమెరికా తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సెక్స్ రాకెట్‌లో తన ప్రమేయం లేదని సతీష్ వేమన ముందు జాగ్రత్తగా కొన్ని మీడియా సంస్థలకు వివరణ ఇచ్చుకోవడంపై తానా ప్రతినిధుల్లో భిన్న వాదనలు వ్యక్తమైనట్టు తెలిసింది. తప్పు చేయనప్పుడు మీడియాకు ముందే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని పలువురు సహచరులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది.
చికాగో కోర్టుకు ‘సెక్స్ రాకెట్’ దంపతులు...
సినీతారల సెక్స్ రాకెట్ కేసులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను ఎఫ్‌బీఐ గురువారం ఇల్లినాయిస్ కోర్టులో హాజరు పరిచింది. గురువారం నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం అయినందున కిషన్ దంపతులు అప్రూవర్‌గా మారి నోరు విప్పితే పలువురు ప్రముఖుల గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు. కిషన్ దంపతులకు రెండేళ్ల క్రితమే వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ సినీతారలు, ప్రముఖులను తరలించి సెక్స్ రాకెట్ నడపటాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి జరుగుతున్నట్లు భావించినా పదేళ్ల నుంచి కొనసాగుతున్నట్టు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ సమాచారం. అమెరికాకు సినీతారలు, ప్రముఖులు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారు తదితర వివరాలు చంద్రకళ డైరీలో రాసి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ డైరీ ఇప్పుడు ఎఫ్‌బీఐ చేతికి చిక్కడంతో ఎవరి జాతకాలు బయటపడతాయోననే కలవరం మొదలైంది.
తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఎఫ్‌బీఐ
దాదాపు ఆరు నెలల క్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి సెక్స్ రాకెట్‌లో పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. వీరిపై కేసు నమోదు చేసిన చికాగో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టి దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.
సాంస్కృతిక ప్రదర్శనల పేరుతో వ్యభిచారం చేయడం తీవ్రమైన నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంటోంది. అమెరికాలో ఇష్టపూర్వకంగా జరిగే వ్యభిచారంపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ మారుపేర్లతో విదేశీయులను తరలించి వ్యభిచారంలోకి దించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్‌లో దాదాపు రూ.40 కోట్ల మేర చేతులు మారినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment