రాష్ట్ర విభజనను తెలుగు జాతి అంగీకరించటం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను తెలుగు జాతి అంగీకరించటం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సచివాలయం ఎదుట ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద గురువారం ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక, విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్రను కోరే ప్రభుత్వంలోని వివిధ శాఖల జేఏసీల ఆధ్వర్యంలో ‘మౌన ప్రదర్శన’ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని బలవంతంగా వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ‘మౌన ప్రదర్శన’కు పూనుకుంటే.. పోలీసులు అడ్డుకోవడం అమానుషమన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను తాము అంగీకరించబోమని, తుదివరకూ సమైక్య రాష్ట్రంకోసం పోరు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి చేగొండి రామజోగయ్య, పుత్తా శివశంకర్‌రెడ్డి, రామభాస్కర్, పోతుల శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.