కేడర్‌ను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు | telugudesam party to try for protect of Cadre | Sakshi
Sakshi News home page

కేడర్‌ను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు

Published Thu, Feb 27 2014 4:59 AM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM

telugudesam party to try for protect of Cadre

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్‌ను కాపాడుకోవడానికి నేతలు పొత్తుల ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన లాబీయింగ్‌తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ‘దేశం’ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్ పార్టీని వీడగా, పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కూడా త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడుతున్న ఈ నేతలతో కలిసి కేడర్ కూడా వెళ్లకుండా నిలుపుకునేందుకు టీడీపీ నేతలు పొత్తును ఎత్తుగడగా వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర పడటంలో బీజేపీ తనదైన పాత్రను పోషించింది. ఈ క్రెడిట్ ఉన్న బీజేపీతో పొత్తు ఉంటుందని చెబితే కొందరైనా నాయకులు,  కార్యకర్తలను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతోనే ‘దేశం’ నేతలు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం నెలకొంది. బీజేపీ నాయకులు మాత్రం పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసలను నివారించడానికి.. కార్యకర్తలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు పొత్తు అంశాన్ని వాడుకుంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దమ్ముంటే చంద్రబాబుతో పొత్తు విషయమై ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 ఆగని వలసలు..
 తెలుగుదేశం పార్టీని వీడిన నగేష్ వెంట కేడర్ వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించి కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. సోమవారం బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఇచ్చోడలో నిర్వహించారు. బీజేపీతో పొత్తు తప్పకుండా ఉంటుందని, కార్యకర్తలు అధైర్య పడవద్దని ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. కానీ ఈ సమావేశానికి ఒక్క ఇచ్చోడ మండల పార్టీ అధ్యక్షుడు మినహా మిగిలిన ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు హజరుకాలేదు. కాగా పార్టీని వీడిన నగేష్ కూడా గురువారం ఇచ్చోడలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాథోడ్ రమేష్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతల్లో సగం మందికి పైగా గురువారం నగేష్ నిర్వహించిన సమావేశానికి హాజరుకావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement