వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టనున్న పనులకు టెండర్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఒకే పనిని రెండు మూడు పనులుగా విభజించి నిబంధనలను అతిక్రమించిన ఆలయ అధికారులు.. కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టడంలోనూ కనీస నియమాలు పాటించలేదు. ముందుగా అనుకున్నట్టే పలువురు కాంట్రాక్టర్లు రింగయి పనులను దక్కించుకున్నారు. మొత్తం 20 పనుల్లో.. నాంపెల్లి గుట్టపై ప్రధాన దేవాలయం చుట్టూ గాల్‌వాల్యూమ్ షెడ్డు నిర్మాణం, ధర్మగుండం వద్ద 5హెచ్‌పీ పంపులు, డీజిల్ ఇంజిన్ ఏర్పాటుకు టెండర్లు దాఖలు కాలేదు. మిగిలిన 18 పనుల్లో తొమ్మిది పనులకు రింగైన కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేశారు. మిగతా తొమ్మిది పనుల్లో రెండింటికి అంచనాల ప్రకారం.. మరో ఏడింటికి లెస్‌కు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. కాంట్రాక్టర్లు రింగయ్యారన్న అనుమానం వచ్చిన ప్రతీసారి టెండర్లను రద్దుచేసి బహిరంగవేలం వేసే అధికారులు.. ఈసారి మాత్రం సీల్డు టెండర్లలో పేర్కొన్న విధంగానే పనులను అప్పగించేందుకు సిద్ధపడ్డారు.
ఎక్సెస్, లెస్ ఇలా..
ఆలయ ఆవరణలో రెండు నెలలు తాత్కాలిక పందిళ్లు వేసే పనికి రూ.4.60 లక్షలు కాగా, 4శాతం ఎక్సెస్, పది రోజులకు రూ.4.80 లక్షల పనికి 8శాతం లెస్, ఏడు నెలలు 12 ఫీట్ల ఎత్తుతో పందిళ్ల ఏర్పాటుకు రూ.4.99 లక్షలు కాగా, 4.95శాతం ఎక్సెస్, 16 ఫీట్ల ఎత్తుతో పందిళ్ల ఏర్పాటుకు రూ.1.90 లక్షలకు, 4.95 ఎక్సెస్‌కు టెండర్లు దాఖలయ్యాయి. నాంపెల్లి గుట్టపై పందిళ్లు వేసే పనికి రూ.95 వేలు కాగా, యథాతథంగా, ప్రధానాలయానికి రంగులు వేసే పనికి రూ.2.75 లక్షలు, ధర్మగుండం, ఆర్సీసీ ఆర్చీగేట్లకు రంగులు వేసే పనులకు రూ.2.25 లక్షలు కాగా, ఈ రెండు పనులు 5శాతం లెస్‌కు కోట్ చేశారు. అనుబంధ దేవాలయానికి రంగులు వేసే పనికి రూ.4.60 లక్షలుగా నిర్దేశించగా, 10శాతం లెస్‌తో ఇద్దరు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. దీంతో డ్రాతీసి ఈ పనులను అప్పగించేందుకు అధికారులు నిర్ణయించారు.
నందీశ్వర కాంప్లెక్స్‌లోని బ్లాక్‌నంబర్-1, బ్లాక్ నంబర్-2 వసతిగదుల్లో ఎలక్ట్రిక్ కీట్యాగ్ స్విచ్‌సిస్టం ఏర్పాటుకు ఒక్కో బ్లాక్ రూ.లక్ష చొప్పున నిర్ణయించగా, 4.25 శాతం ఎక్సెస్‌కు, ప్రధాన ఆలయం ఆవరణలోని ఫ్లై-ఓవర్ బ్రిడ్జిల ప్లాట్‌ఫారాలకు అల్యూమినియం ప్లేట్లు బిగించేందుకు రూ 1.20 లక్షలు కాగా, 2శాతం ఎక్సెస్‌కు, నాంపెల్లి గ్రామ రహదారిపై కేదారేశ్వర పెట్రోల్ బంక్‌వద్ద రూ.4.70 లక్షలతో నిర్ధేశించిన ఐరన్ ఆర్చిగేట్ ఏర్పాటు పనులను అంచనాల ప్రకారం దక్కించుకున్నారు. అనుబంధ ఆలయాల ముందుభాగంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను రూ.4.70 లక్షలు నిర్ణయించగా, 4.99 శాతం ఎక్సెస్‌కు, బస్‌డిపో వద్ద ఆలయానికి చెందిన ఖాళీ స్థలం చుట్టూ రూ.145 లక్షలతో కంచె ఏర్పాటు పనికి 4.99 శాతం లెస్‌తో, బాలానగర్ వద్దనున్న ఆలయం ఖాళీస్థలం చుట్టూ రూ.3.40 లక్షలతో ఫెన్సింగ్ వేసే పనిని 6శాతం లెస్‌తో దక్కించుకున్నారు. మొదటి బైపాస్ శివారులోని ఖాళీ స్థలంచుట్టూ 1.75 లక్షలతో ఫెన్సింగ్ పనిని 4.99శాతం లెస్‌తో, జాతరగ్రౌండ్‌లోని గోశాల షెడ్డు ఎత్తును పెంచేందుకు రూ.1.20 లక్షల పనికి 2శాతం ఎక్సెస్‌తో, నగరేశ్వరస్వామివారి ఆలయానికి విమానగోపురం పునర్నిర్మాణానికి రూ.12 లక్షల పనిని 4.81శాతం ఎక్సెస్‌తో కాంట్రాక్టర్లకు అప్పగించారు.
మహాశివరాత్రి పనులకు టెండ‘రింగ్’
Published Tue, Dec 17 2013 5:42 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement
Advertisement