- ఇంక్రిమెంట్ల కోతతో ప్రభుత్వ వైద్యుల్లో ఆందోళన
- పనిష్మెంట్‌కు గురైన వారిని పదవుల్లో కొనసాగిస్తారా ? లేదా ?
- ఓ వ్యక్తి స్వార్థంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్న వైద్యులు
గుంటూరు మెడికల్ : ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 20 మంది గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయటంతో వైద్యుల్లో ఆందోళన ప్రారంభమైంది. మంగళవారం పలువురు ప్రభుత్వ వైద్యుల ముఖాల్లో ఆందోళన, అలజడి ప్రస్ఫుటంగా కనిపించాయి. ముఖ్యంగా యువ వైద్యులు, పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వైద్యుల్లో ఏం జరుగుతుందోననే కంగారు కనిపిం చింది. అనేక మంది ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దిమంది పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని మిగతా వారిని పక్కకు తప్పించారని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ఇద్దరు జీజీహెచ్ వైద్యుల మధ్య కుర్చీ పోరేనని వారు అంటున్నారు.
రాష్ట్రమంతా రాజుకుంది
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ కోసం 2014లో ఇద్దరు వైద్యులు పోటీ పడ్డారు. జనరల్ సర్జరీ వైద్యునికి సూపరింటెండెంట్ పోస్టు ఖరారు చేశారు. జీవో కూడా విడుదలైంది. అదే సమయంలో మత్తు వైద్య ని పుణులు సూపరింటెండెంట్ పోస్టు కోసం రాష్ట్ర ఉన్నతాధికారుల అండదండలతో ప్రయత్నం చేశారు.
సర్జరీ డాక్టర్ సొంతంగా నర్శింగ్ హోమ్ పెట్టుకుని ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారని మెమో ఇప్పించారు. మెమోను సాకుగా చూపించి సూపరింటెండెంట్ పోస్టుకు అనర్హుడిని చేశారు. దీంతో సర్జరీ డాక్టర్ రాష్ర్టంలో ఎంత మంది ప్రభుత్వ వైద్యులు సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారో వారి వివరాలను విజిలెన్స్ అధికారులు, ఉన్నతాధికారులు అందజేశారు.
వారందరి పైనా చర్యలు తీసుకోకపోతే తనపైనా చర్యలను ఉపసంహరించాలని కోరారు. విజిలెన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పింది.
పక్కన పెడతారా ? కొనసాగిస్తారా ?
గతంలో మెమో ఆధారంగా ఓ వ్యక్తికి సూపరింటెండెంట్ సీటు ఇవ్వకుండా పక్కన పెట్టిన అధికారులు.. నేడు ఇంక్రిమెంట్స్ కోతకు గురైన వారిని ఉన్నత స్థానాల్లో కొనసాగిస్తారా లేక పక్కన పెడతారా అనే విషయంపై చర్చ నడుస్తోంది. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు ఇంక్రిమెంట్స్‌లో కోత విధిస్తూ 20 మంది వైద్యుల జాబితాలో ఆయన పేరునూ ప్రభుత్వం చేర్చింది.
ఇదే విధంగా అడిషనల్ డీఎంఈ బాజ్జికి కూడా నర్సింగ్ హోమ్ ఉందని ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ నివేదిక ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. వీరిపై చర్యలను తీసుకున్న నేపథ్యంలో పదవుల నుంచి పక్కన పెట్టకుండా కొనసాగిస్తే ప్రభుత్వ తీరుపై వైద్యుల సంఘం నేతలు తీవ్రస్థాయిలో మండిపడతారు.
9న వైద్యుల సమావేశం
జీజీహెచ్‌తోపాటుగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలను ఉపక్రమిస్తున్న నేపథ్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యుల సంఘ నేతలు విజయవాడలో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం 2004లో సాయంత్రం 4 గంటల తర్వాత ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఇవ్వటం వల్లే తాము క్లినిక్‌లకు వెళ్తున్న విషయాన్ని వివరించాలని నిర్ణయించారు.