
జీవితమే ముగిసింది!
ఈరోజే చివరి పరీక్ష.. దాంతో పరీక్షలు ముగిసిపోతాయి.. ఇక అంతా ఆటవిడుపే..అన్న ఆనందంతో వెళ్లిన ఆ విద్యార్థి జీవితమే ముగిసిపోయింది. కారు రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. పరీక్షలు అయిపోతాయి.. అటునుంచి అటే సినిమా చూసి వస్తానని వెళ్లిన కొడుకు ఇక తిరిగిరాడని తెలుసుకున్న ఆ పేద తల్లిదండ్రుల గండెలవిసిపోయాయి. కూలీనాలీ చేసి రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తున్న కొడుకు ప్రయోజకుడవుతాడన్న వారి ఆశలను విధి అర్ధంతరంగా తుంచేసింది. తీరని విషాదంలో ముంచేసింది.
సంఘటన స్థలంలో మృతదేహం తప్ప ప్రమాదానికి కారణమైన కారు లేదు.. ప్రమాదానికి కారకులైన వారితో పోలీసులు కుమ్మక్కై పంపించేశారన్న భావన.. విషాదంలో ఉన్న మృతుడి బంధువులు, గ్రామాస్తుల్లో ఆవేశాన్ని ఎగదోసింది. ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇంకేముంది.. సీఎస్పీ ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా మృతదేహంతో బాధితులు బైఠాయించారు. ఆవేశాగ్నితో జ్వలించిపోయారు. నచ్చజెప్పబోయిన పోలీసులపై తిరగబడ్డారు. కొందరు చేయి కూడా చేసుకున్నారు. అయినా పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. గంటల తరబడి బాధితులతో చర్చలు జరిపారు. తమ తప్పేమీ లేదని నచ్చజెప్పారు. చివరికి వారిని శాంతింపజేశారు. అప్పటికే ఐదు గంటలపాటు సుమారు 10 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సంఘటనతో వీరఘట్టం మండలం చిట్టిపుడివలస జంక్షన్ అట్టుడికిపోయింది.
చిట్టపుడివలస (వీరఘట్టం), న్యూస్‌లైన్ :రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పరీక్షకు వెళుతున్న విద్యార్థి మృతి చెందాడు. సమాచారం అందుకుని వచ్చిన మృతుడి బంధువులకు సంఘటన స్థలంలో ప్రమాదానికి కారణమైన వాహనం కనిపించలేదు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురై ఆందోళన చేపట్టారు. ఒక దశలో పోలీసులపై చేయి చేసుకున్నారు. ఆవేదన, ఆగ్రహంతో ఉన్న మృతుడి బంధువులకు సరైన సమాచారం అందకపోవడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల సంయమనం, ఆందోళనకారులతో జరిపిన చర్చలతో సుమారు ఐదు గంటల ఆందోళన విరమించారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
వంగర మండలం పెదరాజుల గుమ్మడకు చెందిన కెంగువ గోవింద (15) కోదులగుమ్మడ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అతనికి వీరఘట్టం జెడ్పీ హైస్కూల్‌ను పదో తరగతి పరీక్ష కేంద్రంగా కేటాయించారు. రోజూ నాగావళి నది దాటి విక్రమురం మీదుగా వీరఘట్టం వచ్చి పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల ఆఖరు రోజైన మంగళవారం తన తల్లి రూపావతి (సూర్యుడమ్మ)తో కలిసి చిట్టపుడివలసలోని పిన్నిగారింటికి చేరుకున్నాడు. వారాలున్నాయని తల్లి ఉండిపోవడంతో ఉదయం 8 గంటలకు చిట్టపుడివలస నుంచి తోటి విద్యార్థులతో కలిసి సైకిళ్లపై వీరఘట్టం బయలుదేరాడు. చిట్టపుడివలస జంక్షన్‌లో సైకిల్‌ను శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో పడిపోయిన గోవింద తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న నాగరాజుకు కుడికాలు విరిగిపోయింది.
కారు లేకపోవడంతో...
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుంటుండగా, గోవింద తల్లిదండ్రులు రూపావతి, సత్యనారాయణ, ఆ గ్రామ సర్పంచ్ వావిలపల్లి వర్దన్‌రావు తదితరులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి విలపించారు. ప్రమాదానికి కారణమైన కారు ఘటన స్థలంలో లేకపోవడంతో వారిని ఆగ్రహానికి గురి చేసింది. కారు యజమానితో పోలీసులు కుమ్మక్కయ్యారని విరుచుకుపడ్డారు. ఏఎస్సై, ఇతర సిబ్బందిపై పె దాడి చేశారు. పోలీసులు చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. ఆందోళనకారులు ప్రధాన రహదారిపై అడ్డంగా రెండు టెంట్లు వేసి మృతదేహంతో బైఠాయించారు.
స్తంభించిన ట్రాఫిక్
విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెదరాజుల గుమ్మడ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాకుళం-పార్వతీపురం సీఎస్పీ రహదారి దిగ్బంధంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాలకొండ సీఐ మజ్జి చంద్రశేఖర్, పాలకొండ ఎస్సై ఎల్.చంద్రశేఖర్, రేగిడి ఎస్సై ఎన్.కామేశ్వరరావు తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. తాము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఏఎస్సై బి.రామారావు కేసు నమోదు చేశారు. వీఆర్వో నగేష్ ఆధ్వర్యంలో పంచనామా జరిపి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
సమాచార లోపంతో...
ప్రమాదానికి కారణమైన వాహనం సంఘటన స్థలంలో ఉంటే ట్రాఫిక్‌కు ఇబ్బందని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ విషయం పోలీసులు చెప్పినా ఆగ్రహంలో ఉన్న మృతుడి బంధువులు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన సందర్భంగా వాహనాలు నిలిచిపోవడంతో మండుటెండలో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమీప కేంద్రం కేటాయిస్తే...
పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం గోవింద ప్రాణా న్ని బలిగొందని పలువురు విమర్శిస్తున్నారు. వంగర మండల విద్యార్థులు వీరఘట్టం రావాలంటే నాగావళి నది దాటి రావాలి. రవాణా సౌకర్యం లేక సైకిళ్లపై రావాలి. వంగర మండలంలో ఆయా గ్రామాల సమీప పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించాలని సూచిస్తున్నారు. ఈ ఘటనతోనైనా విద్యాశాఖాధికారులు ఆ దిశగా యోచన చేయాలని కోరుతున్నారు.
పెదరాజులగుమ్మడలో విషాదం
వంగర : పదో తరగతి విద్యార్థి కెంగవ గోవింద మృతితో మండలంలోని పెదరాజులగుమ్మడలో విషాదం అలముకుంది. పరీక్ష రాసి వచ్చి సాయంత్రం వీరఘట్టంలో సినిమాకు వెళతానని చెప్పాడని గోవింద తల్లిదండ్రులు రోదించారు. మరో వారంలో కుమార్తె వివాహం జరగాల్సి ఉందని, ఈలోగా ఇలాగైందని రోదించారు. రోజూ విక్రమపురం మీదుగా వచ్చే వాడు ఆఖరి రోజున చిట్టపుడివలస మీదుగా వచ్చి ప్రాణాలు కోల్పోయాడని బావురుమన్నారు. గోవింద మృతికి జేకేగుమ్మడ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.