షట్టర్ క్లోజ్!
శ్రీకాకుళం అర్బన్: వస్త్రాలపై వస్తు వినియోగ పన్ను 5 శాతం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. వస్త్ర వ్యాపారుల సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు మంగళవారం బంద్ పాటించారు. దీంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. బుధ, గురువారాల్లో కూడా వ్యాపారులు బంద్‌ను పాటించనున్నారు. దేశ వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలుకానున్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో వస్త్రంపై పూర్తిగా పన్నును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర వస్త్రవ్యాపార సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు స్వచ్ఛందంగా తమ షాపింగ్‌మాల్స్, షాపులను మూసేశారు.
జిల్లా వ్యాప్తంగా..
శ్రీకాకుళం నగరంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల కేంద్రాలతోపాటు పట్టణాల్లోని వస్త్రదుకాణాలు తెరుచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా వస్త్ర దుకాణాల్లో సుమారు కోటిన్నర రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్టు జిల్లా వస్త్ర వ్యాపార సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. వస్తవానికి తొలుత నాలుగు రోజులు బంద్ నిర్వహించాలని నిర్ణయించిన వస్త్రవ్యాపార సంఘ ప్రతినిధులు సోమవారం రాత్రి సమావేశమై మూడు రోజులు చేయాలని నిర్ణయించుకున్నారు. వస్త్ర దుకాణాలను మూసివేయడంతో కొంతమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డాయి. అయితే తొలిరోజు బంద్ విజయవంతమైంది.
వస్త్రాలపై విధించిన పన్నును ఎత్తివేయాలి
వస్త్రాలపై విధించిన 5 శాతం పన్నును ఎత్తివేయాలని వస్త్రవ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోణార్క్ శ్రీను డిమాండ్ చేశారు. చిన్నబజారు రోడ్డులోని వస్త్రవ్యాపారుల సంఘ కార్యాలయంలో మంగళవారం వస్త్రవ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వస్త్రవ్యాపారులంతా జీఎస్‌టీను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీన ఒకరోజు బంద్ పాటించామన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు మూడు రోజులపాటు బంద్ చేస్తున్మాన్నారు. ఇచ్ఛాపురం నుంచి గ్రామస్థాయిలో వ్యాపారులంతా బంద్‌లో పాల్గొన్నారన్నారు. స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకూ వస్త్రాలపై పన్ను లేదని, ఇపుడు కొత్తగా అమలు కానున్న జీఎస్‌టీలో 5 శాతం విధించడం దారుణమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వస్త్రాలపై పన్ను విధిస్తే వస్త్రవ్యాపారులంతా దీటుగా ఎదుర్కొని ఉద్యమించి పన్నును ఎత్తివేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చామన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికశాతం వస్త్రవ్యాపారమేనన్నారు.
దీనిపై పన్ను విధించడం దారుణమన్నారు. వస్త్రవ్యాపారుల సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులతో బుధవారం సమావేశాన్ని శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణమండపంలో ఏర్పాటు చేయనున్నామని, అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్తామని.. అనంతరం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ ర్యాలీలో వస్త్రవ్యాపారులు, షాపులు, దుకాణాల్లో పనిచేసే కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారుల సంఘ ప్రతినిధి అంధవరపు రఘు మాట్లాడుతూ వ్యాపారులంతా ఐకమత్యంగా ఉండి పోరాడితేనే సమస్యను సాధించుకోగలమన్నారు. సమావేశంలో వస్త్రవ్యాపారుల సంఘ ప్రతినిధులు బరాటం చంద్రశేఖర్, శిల్లా వేణుగోపాల్, శిల్లా కాళి, డి.సతీష్, మావూరి శ్రీనివాసరావు, లక్ష్మణ్, గుడ్ల శ్రీను, బి.ముత్యాలరావు, బరాటం మురళి, బరాటం నాగేశ్వరరావు పాల్గొన్నారు.