జగన్ గారూ... ధన్యవాదాలు
- ప్రతిపక్ష నేతకు సీపీఐ నేత రామకృష్ణ ఫోన్
- జనం కోసం జరిగే పోరాటాలకు మద్దతిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై పోరాడుతున్న తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం జగన్‌కు ఫోన్ చేశారు. ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేక హోదా కోసం ధర్నాలు జరిగాయి. ఇందులో భాగంగా రామకృష్ణ ఆధ్వర్యంలో అనంతపురంలో ఆందోళన చేశారు.
సీపీఐ కార్యకర్తలు టెలిఫోన్ కార్యాలయంలోకి ప్రవేశించి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారన్న ఆరోపణల మేరకు పోలీసులు రామకృష్ణతో పాటు పది మందిని అరెస్ట్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆ మర్నాడు అంటే 19వతేదీన శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీపీఐ నేత అరెస్ట్‌పై హోం మంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నేతల్ని అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
దీనివల్ల సమస్య తీవ్రత రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందని, అందుకు ధన్యవాదాలు తెలపడం తమ బాధ్యతని రామకృష్ణ చెప్పారు.ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలకు తావు లేదని.. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అరెస్ట్ చేసినప్పుడు, వారి పట్ల పాలకులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉంటుందని జగన్ అన్నట్టు సమాచారం.