అది ద్రవ్య బిల్లు
కేవీపీ ప్రైవేటు బిల్లుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ధారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి వీలుగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ధారించారు. ఈ మేరకు చైర్మన్ ఆదేశాలను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. కేవీపీ బిల్లులోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు, ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2015ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 117, క్లాజు(1)ను బట్టి ద్రవ్య బిల్లుగా నిర్ధారిస్తున్నట్టుగా కురియన్ ప్రకటించారు.
స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు: కేవీపీ
తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారించి రాజ్యసభలో చర్చ నుంచి తొలగించడాన్ని కేవీపీ తప్పుబట్టారు. రాజ్యసభ నియమావళి 185(3) ప్రకారం కేవీపీ బిల్లును చర్చ నుంచి శుక్రవారం తొలగించారు. దీనిపై కేవీపీ స్పందిస్తూ..లోక్‌సభ స్పీకర్ ఇది ద్రవ్య బిల్లుకాదని తేల్చినా.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ద్రవ్య బిల్లుగా నిర్ధారించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు.