పెదకాకాని, విజయవాడల్లో జరిగిన చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, మూడు లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు తెలిపారు.
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
Published Tue, Sep 24 2013 5:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
పెదకాకాని, న్యూస్‌లైన్: పెదకాకాని, విజయవాడల్లో జరిగిన చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, మూడు లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు తెలిపారు. ఈ కేసుల్లో విజయవాడ సమీపంలోని రామవరప్పాడు హనుమాన్‌నగర్‌కు చెందిన మాతంగి శ్యాంబాబు, ప్రసాదంపాడు పురుషోత్తంనగర్‌కు చెందిన కోతాటి నానిలను సోమవారం ఉదయం మంగళగిరి బైపాస్‌లో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెదకాకాని అంబేద్కర్‌నగర్ రెండోలైన్‌లో మునగాల ఉమామహేశ్వరరావు, అతని పెద్దకుమారుడు అజయ్‌బాబు ఒకే ఇంట్లో పక్కపక్క పోర్షన్లలో నివశిస్తున్నారు.
గత నెల 11వ తేదీ రాత్రి అజయ్‌బాబు హైదరాబాద్ వెళ్లడంతో ఆ పోర్షన్ తాళాలను చొక్కాలో వేసి వంకీకి తగిలించి ఉమామహేశ్వరరావు దంపతులు నిద్రపోయారు. దొంగలు బయట వంకీకి తగిలించిన చొక్కాలో తాళాలు తీసుకుని అజయ్‌బాబు గదిలోకి ప్రవేశించారు. బీరువా పక్కనే తాళాలు ఉండడంతో లాకర్ తెరిచి బంగారు ఉంగరాలు, చైన్, వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు తదితర సామగ్రి దొంగిలించి ఇంటి వెనుక తలుపు తీసుకుని వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం పెదకాకాని సీఐకు సమాచారం అందడంతో మంగళగిరి బైపాస్‌లో నిందితులు శ్యాంబాబు, నానిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెదకాకాని అంబేద్కర్‌నగర్‌లో దొంగిలించిన వస్తువులతోపాటు విజయవాడ బ్యాంకు కాలనీలోని ఇంట్లో దొంగిలించిన వస్తువులు, గుణదల సెంటర్‌లో దొంగిలించిన ప్యాషన్ ఫ్లస్ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల నుంచి పెదకాకానిలో దొంగిలించిన 41గ్రాముల బంగారు వస్తువులు, 170 గ్రాముల వెండివస్తువులు, విజయవాడ చోరీ కేసులో 87 గ్రాముల బంగారు వస్తువులు, 500 గ్రాముల వెండి ఆభరణాలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మోటారు ఫీల్డుకు చెందిన వీరద్దరూ ఆరు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో క్రైం డీఎస్పీ రవీంద్రబాబు, సీఐ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేసును త్వరితగతిన పరిష్కరిం చడంలో చొరవ చూపిన సిబ్బంది హెచ్‌సిలు ఆరాధ్యుల కోటేశ్వరరావు, కగ్గా సాంబశివరావు, పీసీలు బెల్లంకొండ గురవయ్య, వుల్లగంట కృష్ణప్రసాద్, టి.శ్రీనివాసరావు, వై.శ్రీనివాసరావులను పోలీసు అధికారులు అభినందించారు.
Advertisement
Advertisement