Ramavarappadu
-
ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడి..
సాక్షి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకమ్మ తల్లి ఆలయం సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న వ్యక్తిని గన్నవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిన పడిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
సంతానం లేదు.. జీవితంపై విరక్తితో
సాక్షి, అమరావతి : రామవరప్పాడులో దారుణం చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... రామవరప్పాడుకు చెందిన గొట్టిపాటి నాగ మురళీకృష్ణ ట్రాన్సుపోర్టు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కలిసి గోలి కృష్ణయ్య వీధిలో నివాసం ఉంటున్నాడు. కాగా ఈ దంపతులకు సంతానం లేదు. దానికితోడు మురళీకృష్ణ భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె మరణించింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి పేరుతో సూసైట్ నోట్ లభించింది. కాగా సమాచారం అందుకున్న పటమట ఏసీపీ అంకినీడు ప్రసాద్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. -
రామవరప్పాడు జంక్షన్ వద్ద ఉద్రిక్తత
-
రామవరప్పాడు జంక్షన్ వద్ద ఉద్రిక్తత
విజయవాడ : ప్రత్యేక హోదా అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడుకు కమ్యూనిస్టుల నుంచి నిరసన ఎదురవుతుంది. ప్రత్యేక హోదాను దూరం చేసిన వెంకయ్యనాయుడు గోబ్యాక్ అంటూ సీపీఐ, సీపీఎం నాయకులు నల్లజెండాలతో రామవరప్పాడు సెంటర్లో ఆందోళన నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంకయ్యనాయుడు అక్కడి నుంచి ఆయన పాల్గొన్న ర్యాలీ రామవరప్పాడు వద్దకు చేరుకునే సరికి పోలీసులు అప్రమత్తమైయ్యారు. వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో్ వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు వెంకయ్యకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హోదాను సాధించలేని వెంకయ్యనాయుడు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ... సభలలో పాల్గొనడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దూరమైందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెద్దల కోసమే అలైన్మెంట్ మార్పు: వైఎస్ జగన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలని రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి బాధలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పేదల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పెద్దల కోసం అలైన్మెంట్లు మార్చేసి పేదల ఇళ్లు తొలగించడం దారుణమన్నారు. రాజధాని నడిబొడ్డున అభివృద్ధి పేరుతో ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఫ్లై ఓవర్ అనే బూచి చూపించి దారుణాలకు దిగుతున్నారని.. 50-60 సంవత్సరాలుగా ఉంటున్నవారిని వెళ్లగొడుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్పొరేటర్ హోటల్‌కు లాభం చేకూర్చడానికే అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు. ఇప్పటికే 120 ఇళ్లు కూల్చారు. మరో 500 ఇళ్లు కూల్చడానికి సిద్ధమయ్యారని వైఎస్ జగన్ అన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చాలనుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఈ రూట్లో వెళ్తునప్పుడు గుడిసెలు కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారన్నారు. పేదలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ వెంట జిల్లా ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. గన్నవరం విమానశ్రయంలో వైఎస్ జగన్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. -
రామవరప్పాడులో భారీ షెడ్
2018 నుంచి షెడ్డుకు నాలుగు మెగావాట్లు రాజీవ్‌గాంధీ పార్క్ సమీపంలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పలుచోట్ల మెట్రోకు తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు సన్నాహాలు విజయవాడ నగరంలో నిర్మింత కానున్న మెట్రో ప్రాజెక్ట్‌కు రామవరప్పాడులో 60 ఎకరాలలో భారీ షెడ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొద్దినెలల్లో మొదలుకానున్నాయి. ఇప్పటికే మెట్రో ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ ఖరారు చేసి రెండు కారిడార్లుగా విభజించి రెండు దశల్లో పనులు చేయాలని మెట్రో ఆధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈఏడాదిలో మొదలుపెట్టి 2019 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి మే-జూన్ మాసాలలో ట్రయల్ రన్ నిర్వహించి తదనంతరం మార్పులు చేర్పులు చేసి ఆగస్టు ఒకటి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. పెనమాలూరు నుంచి మొదలై బెంజిసర్కిల్ మీదుగా బందరు రోడ్డులో బస్టాండు వరకు 13 కిలోమీటర్లు మేర మొదటి కారిడార్ పనులు జరుగుతాయి. ఇది 2016 నాటికి పూర్తి కావాల్సి ఉంది. రెండో కారిడార్‌లో నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, గుణదల, ఏలూరురోడ్డు, అలంకార్, రైల్వేస్టేషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పోలీసు కంట్రోల్‌రూం, ఫైర్‌స్టేషన్ మీదుగా బస్టాండు వరకు 13 కిలోమీటర్లు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈక్రమంలో మెట్రో గూడ్స్ వ్యాగిన్, వర్క్‌షాప్‌ను రామవరప్పాడు రింగ్ సమీపంలో 60 ఏకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయటానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని పనులు, కోచ్‌ల నిర్మాణం, ఇతర ఇంజనీరింగ్ పనులు అన్ని అక్కడే జరగనున్నాయి. మెట్రో పనుల సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలను గుర్తించి వాటి ద్వారా పనులు జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. మొదటి కారిడార్‌లో రాఘవయ్య పార్క్ సెంటర్, డివి మ్యానర్, బెంజ్ సర్కిల్ రెండో కారిడార్ పరిధిలోకి వచ్చే బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, ఎస్ఆర్ఆర్ కాలేజ్ సెంటర్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి పనులు జరపనున్నారు. విద్యుత్ శాఖకు ఇచ్చిన ప్రతిపాదనలు ఆరు తాత్కాలిక షెడ్డులకు కాంట్రాక్టర్ డిమాండ్‌కు అనుగుణంగా పనుల దశకు, అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలి. పనులు మొదలయ్యాక శాశ్వత రీతిలో మెట్రో అవసరాలకు రాజీవ్‌గాంధీ పార్క్ సమీపంలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను మెట్రోనే నిర్మించనుంది. పూర్తి మెట్రో ప్రాజెక్ట్‌కు విద్యుత్ సరఫరా దాని నుంచి చేసేలా విద్యుత్ కేటాయింపులు చేయాలి. ప్రస్తుతం నగరంలో విద్యుత్ వాడకం రోజుకి 2ఎంఎల్‌గా ఉంటుంది. 2019 నుంచి మెట్రో అందుబాటులోకి వస్తే దానితో కలిపి 6ఎంఎల్‌గా ఉంటుంది. రానున్న రోజుల్లో విద్యుత్ కోటా పెంచుకుంటూ ఉండాలి. రామవరప్పాడులో షెడ్డు నిర్మాణం పనులకు సాధారణ రోజుల్లో 100 కిలోవాట్స్ విద్యుత్ వినియోగం ఆ తర్వాత 2016 నుంచి పనులు పూర్తి అయ్యే వరకు రోజుకి 23 నుంచి 4 మిలియన్ వాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఆరు తాత్కాలిక షెడ్డుకు రోజుకి 50 నుంచి 100 కేవీ విద్యుత్ సరఫరా అవసరం అవుతుంది. ప్రాథమికంగా రెండు రహదారుల్లో సుమారు 150 విద్యుత్ వైర్లు క్రాసింగ్ ఉన్నాయని వాటిని మెట్రో ఖర్చుతో విద్యుత్ శాఖ తొలగించుకోవాల్సిందిగా సూచించారు. రెండు ప్రధాన రహదారుల్లో ఉన్న విద్యుత్ లైన్ కూడ 18 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేయటం లేక అండర్ గ్రౌండ్కేబుల్ ద్వారా వేసే అంశాన్ని పరిశీలిస్తారు. -
సాయిబాబా ఆలయంలో భారీ చోరీ
విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడ నగరం ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గ్యాస్‌కట్టర్ సాయంతో ఆలయ కిటీకీ తలుపులు తొలగించిన దుండగులు లోపలికి ప్రవేశించి సాయిబాబా, దత్తాత్రేయ, వినాయక ప్రతిమలకు ఉన్న సుమారు 34 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకు పోయారు. అలాగే ఆలయంలోనే ఉన్న రెండు హుండీలను పగులగొట్టి రూ.20 వేల నగదు మాయం చేశారు. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు ముందుగా సీసీ కెమెరాను పనిచేయకుండా చేశారు. తెల్లవారి విషయం తెలుసుకున్నఆలయ పూజారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (రామవరప్పాడు) -
పత్తాలేని ఫ్లై వోవర్ నిర్మాణ కంపెనీ
అనుమతులు వచ్చినా పనులు మొదలుపెట్టని వైనం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు పూర్తిచేసేందుకు ఆరు నెలలు డెడ్‌లైన్ విధించిన సీఆర్డీఏ విజయవాడ బ్యూరో : అన్ని అనుమతులు వచ్చినా రామవరప్పాడు ఫ్లై వోవర్ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంలేదు. అభ్యంతరాలు తొలగిపోయిన తర్వాత కూడా నిర్మాణ సంస్థ అలసత్వం ప్రదర్శిస్తోంది. పనులు ఎందుకు మొదలు పెట్టడంలేదని సీఆర్డీఏ అధికారులు పదేపదే అడుగుతున్నా.. నిర్మాణ కంపెనీ ఇప్పటివరకూ స్పందించలేదు. అసలు కాంట్రాక్టు పొందిన కంపెనీ ప్రతినిధిని ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకపోవడం విశేషం. సబ్ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తులే అధికారులను కలిసి ఏదో ఒక సాకు చెప్పి వెళ్లిపోతున్నట్లు సమాచారం. దీనిపై ఆగ్రహంగా ఉన్న సీఆర్డీఏ అధికారులు ఆరు నెలల్లోపు పనులు పూర్తి చేయాలని సబ్ కాంట్రాక్టరుకు తేల్చి చెప్పారు. ఆరేళ్ల క్రితం ప్రారంభమై... : ఇన్నర్ రింగురోడ్డులో భాగంగా విజయవాడ-గుడివాడ రైల్వే లైనుపై నిర్మించాల్సిన ఫ్లై వోవర్ కాంట్రాక్టును 2009లో హైదరాబాద్‌కు చెందిన ఆర్వీఎస్ కనష్ట్రక్షన్స్ కంపెనీ పొందింది. ఆ సంస్థ నేరుగా ఈ పనులు చేయకుండా సబ్ కాంట్రాక్టుకు వేరే వారికి ఇచ్చింది. మొదట్లో రూ.80 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ పనులు తీవ్ర జాప్యమయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం రూ.119 కోట్లకు పెరిగింది. అసలే పనులు ఆలస్యంగా జరుగుతుండగా, 2013 డిసెంబర్లో ఫ్లై వోవర్ దిమ్మెలలో ఒకటి కూలిపోయింది. దీంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి ఉడా విచారణ నిర్వహించి నాణ్యత నిర్ధారణ కోసం మద్రాస్ ఐఐటీని సంప్రదించింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినా.. ప్రాజెక్టు పూర్తి నాణ్యత పరిశీలన కోసం మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ విభాగాన్ని సంప్రదించారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా కొద్దిరోజుల క్రితం నిరభ్యంతర పత్రం ఇచ్చింది. అభ్యంతరాలేమీ లేకపోవడంతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు తిరిగి పనులు ప్రారంభించాలని గత నెలలోఆర్వీఎస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీని కోరారు. అయినా ఇప్పటివరకూ కంపెనీ స్పందించలేదు. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సబ్ కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులను కలిసి రకరకాల కుంటి సాకులు చెబుతున్నట్లు తెలిసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆరు నెలల్లోపు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఫ్లై వోవర్కు సంబంధించి 40 శ్లాబులు వేయాల్సి ఉండగా, వెంటనే రెండు శ్లాబులు వేయాలని సూచించారు. పని చేయలేకపోతే తప్పుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. అగ్రిమెంట్ కుదుర్చుకున్న కంపెనీ ప్రతినిధిని పిలిపించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డురానున్న హోటల్ ఫ్లై వోవర్ నిర్మాణ పనులకు రామవరప్పాడు రింగ్ సెంటర్లో ఉన్న ఇన్నోటెల్ హోటల్ అడ్డు రానుంది. హోటల్ భవనాన్ని కొంత తొలగించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత చేపట్టిన భూసేకరణలోనే ఈ హోటల్లో కొంత భాగం తీసుకోవాల్సి ఉన్నా నిర్మాణంలో జాప్యం, ఇతర కారణాల వల్ల గతంలో ఉడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు పనులు ప్రారంభించినా ఒక పిల్లర్, దానిపైన నిర్మించే శ్లాబు కోసం హోటల్ భవనంలో కొద్దిభాగాన్ని తీసుకోవాల్సిందే. దీంతోపాటు ఇంకా మిగిలిన చిన్నచిన్న ఇబ్బందులను అధిగమిస్తేనే ఫ్లై వోవర్ నిర్మాణం పూర్తవుతుంది. వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించి, ఆరు నెలల్లోపు పూర్తయ్యేలా చూడడానికి సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ప్రయత్నాలు చేస్తోంది. -
కోలుకుంటున్న క్షతగాత్రులు
=కారు ప్రమాదం ఘటనలో మృతులకు అశ్రునయనాలతో అంత్యక్రియలు =పరారీలో కారు యజమాని విజయవాడ, న్యూస్‌లైన్ : రామవరప్పాడు వద్ద గురువారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడినవారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖ్, స్నేహప్రభ, సాయిచందన్, పులి ఉదయ్‌కుమార్, గణపతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. సిద్ధిఖ్‌కి మాత్రం తలకు బలమైన గాయమవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. సంఘటన జరిగిన తీరుతో తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగిని స్నేహప్రభను శుక్రవారం పలువురు ఉద్యోగులు వచ్చి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై రెవెన్యూ, పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి... ఈ ప్రమాదంలో మృతిచెందిన మారుతీ సురేష్, ఎస్ఆర్కే విద్యార్థినులు చందుశ్రీ, సింధూజ, జ్యోతిర్మయి మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవిప్రకాష్ ఆదేశాలతో బంధువుల సమక్షంలో మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. అశ్రునయనాలతో అంత్యక్రియలు... పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబసభ్యులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు చేశారు. డాక్టర్ మారుతీ సురేష్‌కు ఇబ్రహీంపట్నంలో, తులాబందుల జ్యోతిర్మయికి సూరంపల్లిలో, చందుశ్రీకి నున్నలో, సింధూజకు రాజీవ్‌నగర్‌లో అంతక్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు వారికి కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికారు. కారుయజమాని పరారీ నిర్లక్ష్యంగా కారు నడిపి నలుగురి మృతికి కారణమైన ఆత్మకూరి కోటంరాజును మాచవరం పోలీసులు విచారిస్తున్నారు. తనకు కారు డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేదని, తన యజమానికి పలుమార్లు చెప్పినా వినకుండా ఈ పనికి పురమాయించారని నిందితుడు విచారణలో వెల్లడించాడు. దీంతో ప్రమాదానికి పరోక్షంగా కారణమైన ప్రియసాయి ఫుట్‌వేర్ కంపెనీ యజమాని నారా అనంత సుబ్రహ్మణ్యాన్ని విచారించేందుకు పోలీసులు గాంధీనగర్‌లోని కంపెనీకి వెళ్లి ఆరా తీశారు. కంపెనీకి తాళం వేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు అతను పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు. అసలు ఈ కారు ఒంగోలుకు చెందిన వ్యక్తిదని (ఓ దినపత్రికలో మేనేజర్) సమాచారం. పోలీసులు మాత్రం ఆ కారు ప్రియసారుుదేనని చెబుతున్నారు. ప్రస్తుతం వారు సుబ్రహ్మణ్యం గురించి గాలిస్తున్నారు. కోటంరాజును మాత్రం విచారణ అనంతరం కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
పెదకాకాని, న్యూస్‌లైన్: పెదకాకాని, విజయవాడల్లో జరిగిన చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, మూడు లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు తెలిపారు. ఈ కేసుల్లో విజయవాడ సమీపంలోని రామవరప్పాడు హనుమాన్‌నగర్‌కు చెందిన మాతంగి శ్యాంబాబు, ప్రసాదంపాడు పురుషోత్తంనగర్కు చెందిన కోతాటి నానిలను సోమవారం ఉదయం మంగళగిరి బైపాస్‌లో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెదకాకాని అంబేద్కర్‌నగర్ రెండోలైన్‌లో మునగాల ఉమామహేశ్వరరావు, అతని పెద్దకుమారుడు అజయ్‌బాబు ఒకే ఇంట్లో పక్కపక్క పోర్షన్లలో నివశిస్తున్నారు. గత నెల 11వ తేదీ రాత్రి అజయ్‌బాబు హైదరాబాద్ వెళ్లడంతో ఆ పోర్షన్ తాళాలను చొక్కాలో వేసి వంకీకి తగిలించి ఉమామహేశ్వరరావు దంపతులు నిద్రపోయారు. దొంగలు బయట వంకీకి తగిలించిన చొక్కాలో తాళాలు తీసుకుని అజయ్‌బాబు గదిలోకి ప్రవేశించారు. బీరువా పక్కనే తాళాలు ఉండడంతో లాకర్ తెరిచి బంగారు ఉంగరాలు, చైన్, వెండి ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు తదితర సామగ్రి దొంగిలించి ఇంటి వెనుక తలుపు తీసుకుని వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం పెదకాకాని సీఐకు సమాచారం అందడంతో మంగళగిరి బైపాస్‌లో నిందితులు శ్యాంబాబు, నానిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెదకాకాని అంబేద్కర్‌నగర్‌లో దొంగిలించిన వస్తువులతోపాటు విజయవాడ బ్యాంకు కాలనీలోని ఇంట్లో దొంగిలించిన వస్తువులు, గుణదల సెంటర్లో దొంగిలించిన ప్యాషన్ ఫ్లస్ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి పెదకాకానిలో దొంగిలించిన 41గ్రాముల బంగారు వస్తువులు, 170 గ్రాముల వెండివస్తువులు, విజయవాడ చోరీ కేసులో 87 గ్రాముల బంగారు వస్తువులు, 500 గ్రాముల వెండి ఆభరణాలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మోటారు ఫీల్డుకు చెందిన వీరద్దరూ ఆరు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో క్రైం డీఎస్పీ రవీంద్రబాబు, సీఐ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేసును త్వరితగతిన పరిష్కరిం చడంలో చొరవ చూపిన సిబ్బంది హెచ్‌సిలు ఆరాధ్యుల కోటేశ్వరరావు, కగ్గా సాంబశివరావు, పీసీలు బెల్లంకొండ గురవయ్య, వుల్లగంట కృష్ణప్రసాద్, టి.శ్రీనివాసరావు, వై.శ్రీనివాసరావులను పోలీసు అధికారులు అభినందించారు.