
పత్తాలేని ఫ్లై వోవర్ నిర్మాణ కంపెనీ
అనుమతులు వచ్చినా పనులు మొదలుపెట్టని వైనం
సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు
పూర్తిచేసేందుకు ఆరు నెలలు డెడ్‌లైన్ విధించిన సీఆర్‌డీఏ
విజయవాడ బ్యూరో : అన్ని అనుమతులు వచ్చినా రామవరప్పాడు ఫ్లై వోవర్ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంలేదు. అభ్యంతరాలు తొలగిపోయిన తర్వాత కూడా నిర్మాణ సంస్థ అలసత్వం ప్రదర్శిస్తోంది. పనులు ఎందుకు మొదలు పెట్టడంలేదని సీఆర్‌డీఏ అధికారులు పదేపదే అడుగుతున్నా.. నిర్మాణ కంపెనీ ఇప్పటివరకూ స్పందించలేదు. అసలు కాంట్రాక్టు పొందిన కంపెనీ ప్రతినిధిని ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకపోవడం విశేషం. సబ్ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తులే అధికారులను కలిసి ఏదో ఒక సాకు చెప్పి వెళ్లిపోతున్నట్లు సమాచారం. దీనిపై ఆగ్రహంగా ఉన్న సీఆర్‌డీఏ అధికారులు ఆరు నెలల్లోపు పనులు పూర్తి చేయాలని సబ్ కాంట్రాక్టరుకు తేల్చి చెప్పారు.
ఆరేళ్ల క్రితం ప్రారంభమై... : ఇన్నర్ రింగురోడ్డులో భాగంగా విజయవాడ-గుడివాడ రైల్వే లైనుపై నిర్మించాల్సిన ఫ్లై వోవర్ కాంట్రాక్టును 2009లో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీఎస్ కనష్ట్రక్షన్స్ కంపెనీ పొందింది. ఆ సంస్థ నేరుగా ఈ పనులు చేయకుండా సబ్ కాంట్రాక్టుకు వేరే వారికి ఇచ్చింది. మొదట్లో రూ.80 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ పనులు తీవ్ర జాప్యమయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం రూ.119 కోట్లకు పెరిగింది. అసలే పనులు ఆలస్యంగా జరుగుతుండగా, 2013 డిసెంబర్‌లో ఫ్లై వోవర్ దిమ్మెలలో ఒకటి కూలిపోయింది. దీంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి ఉడా విచారణ నిర్వహించి నాణ్యత నిర్ధారణ కోసం మద్రాస్ ఐఐటీని సంప్రదించింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినా.. ప్రాజెక్టు పూర్తి నాణ్యత పరిశీలన కోసం మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ విభాగాన్ని సంప్రదించారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా కొద్దిరోజుల క్రితం నిరభ్యంతర పత్రం ఇచ్చింది. అభ్యంతరాలేమీ లేకపోవడంతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు తిరిగి పనులు ప్రారంభించాలని గత నెలలోఆర్‌వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీని కోరారు. అయినా ఇప్పటివరకూ కంపెనీ స్పందించలేదు. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సబ్ కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ ప్రతినిధులు సీఆర్‌డీఏ అధికారులను కలిసి రకరకాల కుంటి సాకులు చెబుతున్నట్లు తెలిసింది.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆరు నెలల్లోపు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఫ్లై వోవర్‌కు సంబంధించి 40 శ్లాబులు వేయాల్సి ఉండగా, వెంటనే రెండు శ్లాబులు వేయాలని సూచించారు. పని చేయలేకపోతే తప్పుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. అగ్రిమెంట్ కుదుర్చుకున్న కంపెనీ ప్రతినిధిని పిలిపించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
అడ్డురానున్న హోటల్
ఫ్లై వోవర్ నిర్మాణ పనులకు రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో ఉన్న ఇన్నోటెల్ హోటల్ అడ్డు రానుంది. హోటల్ భవనాన్ని కొంత తొలగించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత చేపట్టిన భూసేకరణలోనే ఈ హోటల్‌లో కొంత భాగం తీసుకోవాల్సి ఉన్నా నిర్మాణంలో జాప్యం, ఇతర కారణాల వల్ల గతంలో ఉడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు పనులు ప్రారంభించినా ఒక పిల్లర్, దానిపైన నిర్మించే శ్లాబు కోసం హోటల్ భవనంలో కొద్దిభాగాన్ని తీసుకోవాల్సిందే. దీంతోపాటు ఇంకా మిగిలిన చిన్నచిన్న ఇబ్బందులను అధిగమిస్తేనే ఫ్లై వోవర్ నిర్మాణం పూర్తవుతుంది. వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించి, ఆరు నెలల్లోపు పూర్తయ్యేలా చూడడానికి సీఆర్‌డీఏ ఇంజినీరింగ్ విభాగం ప్రయత్నాలు చేస్తోంది.