రామవరప్పాడు వద్ద గురువారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడినవారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
=కారు ప్రమాదం ఘటనలో మృతులకు అశ్రునయనాలతో అంత్యక్రియలు
=పరారీలో కారు యజమాని
విజయవాడ, న్యూస్‌లైన్ : రామవరప్పాడు వద్ద గురువారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడినవారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖ్, స్నేహప్రభ, సాయిచందన్, పులి ఉదయ్‌కుమార్, గణపతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. సిద్ధిఖ్‌కి మాత్రం తలకు బలమైన గాయమవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. సంఘటన జరిగిన తీరుతో తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగిని స్నేహప్రభను శుక్రవారం పలువురు ఉద్యోగులు వచ్చి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై రెవెన్యూ, పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి...
ఈ ప్రమాదంలో మృతిచెందిన మారుతీ సురేష్, ఎస్‌ఆర్‌కే విద్యార్థినులు చందుశ్రీ, సింధూజ, జ్యోతిర్మయి మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవిప్రకాష్ ఆదేశాలతో బంధువుల సమక్షంలో మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.
అశ్రునయనాలతో అంత్యక్రియలు...
పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబసభ్యులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు చేశారు. డాక్టర్ మారుతీ సురేష్‌కు ఇబ్రహీంపట్నంలో, తులాబందుల జ్యోతిర్మయికి సూరంపల్లిలో, చందుశ్రీకి నున్నలో, సింధూజకు రాజీవ్‌నగర్‌లో అంతక్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు వారికి కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికారు.
కారుయజమాని పరారీ
నిర్లక్ష్యంగా కారు నడిపి నలుగురి మృతికి కారణమైన ఆత్మకూరి కోటంరాజును మాచవరం పోలీసులు విచారిస్తున్నారు. తనకు కారు డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేదని, తన యజమానికి పలుమార్లు చెప్పినా వినకుండా ఈ పనికి పురమాయించారని నిందితుడు విచారణలో వెల్లడించాడు. దీంతో ప్రమాదానికి పరోక్షంగా కారణమైన ప్రియసాయి ఫుట్‌వేర్ కంపెనీ యజమాని నారా అనంత సుబ్రహ్మణ్యాన్ని విచారించేందుకు పోలీసులు గాంధీనగర్‌లోని కంపెనీకి వెళ్లి ఆరా తీశారు.
కంపెనీకి తాళం వేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు అతను పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు. అసలు ఈ కారు ఒంగోలుకు చెందిన వ్యక్తిదని (ఓ దినపత్రికలో మేనేజర్) సమాచారం. పోలీసులు మాత్రం ఆ కారు ప్రియసారుుదేనని చెబుతున్నారు. ప్రస్తుతం వారు సుబ్రహ్మణ్యం గురించి గాలిస్తున్నారు. కోటంరాజును మాత్రం విచారణ అనంతరం కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.