ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల శివారులో శుక్రవారం బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు తండ్రీ కొడుకులు. ప్రమాదంలో తండ్రి చనిపోగా కుమారులు గాయపడ్డారు.
బైక్‌ను ఢీ కొట్టిన లారీ
Published Sat, Oct 5 2013 4:10 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల శివారులో శుక్రవారం బైక్‌ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు తండ్రీ కొడుకులు. ప్రమాదంలో తండ్రి చనిపోగా కుమారులు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంటకు చెందిన జిజ్జువరపు వెంకటేశ్వరరావు (65), అతడి ఇద్దరు కుమారులు సుబ్బారావు, మహలక్ష్మణరావు ఏలూరు నుంచి బైక్‌పై సొంతూరుకు వెళుతున్నారు. ద్వారకాతిరుమల మినీ బైపాస్‌రోడ్డు మీదుగా వెళుతుండగా సాయిబాబా ఆలయం దాటిన తర్వాత రెండో మలుపులో వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న సుద్ధ లోడు లారీ ఢీ కొట్టింది. బైక్ లారీ చక్రాల కిందకు దూసుకెళ్లగా ముగ్గురూ చెల్లా చెదురుగా రోడ్డుపై పడ్డారు.
ఈ ఘటనలో తండ్రి వెంకటేశ్వరరావు కాలు నుంచి ఎముక బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావం అయ్యింది. పెద్ద కుమారుడు సుబ్బారావు, చిన్న కుమారుడు మహలక్ష్మణరావులకు తల, ఇతర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మహలక్ష్మణరావు, సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఏలూరు నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై ఎన్.పోతరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా..
వెంకటేశ్వరరావు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం జ్వరం ఎక్కువ కావడంతో ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించేందుకు కుమారులిద్దరూ తండ్రిని బైక్‌పై తీసుకెళ్లారు. వైద్యుడికి చూపించి మందులు తీసుకుని తిరిగి వస్తూ దారిలో తిమ్మాపురం సంతకు వెళ్లి మాంసం, కూరగాయలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి స్వగ్రామం బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా లారీ వారిని ఢీ కొట్టింది. వెంకటేశ్వరరావు మృతి చెందడంతో పాటు ఇద్దరి కుమారులకు తీవ్ర గాయాలు కావడంతో గుండుగొలనుకుంటలో విషాదఛాయలు నెలకొన్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Advertisement
Advertisement