రిమ్స్ సెమీ అటానమస్ విధానం త్వరలో రద్దు కానుంది. జిల్లాకు తలమానికంగా రిమ్స్‌ను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : రిమ్స్ సెమీ అటానమస్ విధానం త్వరలో రద్దు కానుంది. జిల్లాకు తలమానికంగా రిమ్స్‌ను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. 230 ఎకరాలలో వైద్య కళాశాల, ఓపీ, ఐపీ విభాగాలు, నర్సింగ్, దంత వైద్య కళాశాలలను నిర్మింపజేశారు. రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని సంకల్పించి 2008 ఏప్రిల్ 1వ తేదీన జీఓ నంబర్ 12ను విడుదల చేసి సెమీ అటానమస్ హోదాను కల్పించారు. ప్రస్తుతం 1200 మందికిపైగా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు రిమ్స్‌లో పనిచేస్తున్నారు. వైద్య విద్యార్థులు దాదాపు 700కు పైగా విద్యనభ్యసిస్తున్నారు. ఓపీ విభాగంలో రోజుకు 1500 నుంచి 2000 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వైద్య చికిత్సలు పొందుతుంటారు. ఐపీ విభాగంలో 450-600 మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సెమీ అటానమస్ విధానాన్ని త్వరలో రద్దు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అధ్యాపకుల నుంచి డెరైక్టర్ దాకా.. :
సెమీ అటానమస్ రాక ముందు ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు కళాశాల, ఆసుపత్రుల విభాగాలను పర్యవేక్షించేవారు. రిమ్స్ కళాశాల మొదటి ప్రిన్సిపల్‌గా ఇందిరా నారాయణ్ వ్యవహరించారు. తర్వాత రామ్మూర్తి పనిచేశారు. మొదటి డెరైక్టర్‌గా డాక్టర్ పి.చంద్రశేఖర్, ఇన్‌చార్జి డెరైక్టర్‌గా డాక్టర్ ఓబులేసు వ్యవహరించారు.
ప్రస్తుతం రిమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ సిద్దప్పగౌరవ్ పనిచేస్తున్నారు. సెమీ అటానమస్‌లో ఆయన పదవీ కాల పరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ 16 వరకు ఉంది. అయితే సెమీ అటానమస్ రద్దయ్యే పరిస్థితుల్లో తన పదవీ కాలాన్ని పొడగించుకునే పరిస్థితి ఉండకపోవడంతో ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిమ్స్ ప్రిన్సిపల్‌గా ప్రభుత్వ పరిధిలో పనిచేసి తర్వాత సెమీ అటానమస్ కింద పనిచేస్తున్న డాక్టర్ బాలకృష్ణ రాజీనామా చేశారు.
సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రామ్‌శరణ్ కూడా రాజీనామా చేశారు. డెరైక్టర్ వేధింపుల వల్ల వారు రాజీనామా బాట పట్టినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ వారి వ్యక్తిగత ఉద్యోగ భద్రత కోసం రాజీనామా చేసినట్లు సమాచారం.అనాటమీ, ఫిజియాలజీ విభాగాలకు చెందిన ఇరువురు ప్రొఫెసర్లు, మైక్రో బయాలజీ, పెథాలజీ విభాగాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా త్వరలో రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. సెమీ అటానమస్ రద్దయితే ప్రిన్సిపల్, సూపరింటెండెంట్,ఆర్‌ఎంఓలే రిమ్స్‌ను పర్యవేక్షించనున్నారు. సెమీ అటానమస్ రద్దయితే తమ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంటుందేమోనని కొందరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని రిమ్స్‌ల పరిధిలో సెమీ అటానమస్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ రంగంలోని వారినే ఉద్యోగులుగా నియమించాలని ఆలోచనలో ఉండడంతో ఆ విధానం క్రింద పనిచేస్తున్న వారంతా తమ వ్యక్తిగత భద్రత కోసం ఇప్పటి నుంచే రాజీనామా బాట పట్టినట్లు తెలియవచ్చింది.
డెరైక్టర్ ఏమన్నారంటే..
సెమీ అటానమస్‌ను రద్దు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. రిమ్స్ డెరైక్టర్‌గా ఉన్నంత వరకు అభివృద్ధి కోసం కృషి చేస్తాను. రాజీనామా చేయాలనే ఆలోచన లేదు. వ్యక్తిగత కారణాలతోనే కొందరు రాజీనామా చేసినట్లు భావిస్తున్నాను.
- డాక్టర్ సిద్దప్ప గౌరవ్,
రిమ్స్ డెరైక్టర్.