ఇక కేసులే ఆర్డీవోలకు ఆదేశం
Published Mon, Aug 19 2013 7:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గైర్హాజరుకు సరైన కారణాలు చూపిన వారిని చర్యల నుంచి మినహాయిస్తామని ప్రకటించినా అందు కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణాలు తెలిపేందుకు సోమవారం వరకు గడువు ఇచ్చినా... ఇది పూర్తి కాకుండానే గైర్హాజరైన ఉపాధ్యాయుల మీద కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదివారం ఆర్డీవోలను ఆదేశించినట్టు తెలుస్తోంది.సాక్షి, కరీంనగర్ :జిల్లాలో మొత్తం 1220 మంది విధులకు హాజరు కాలేదని లెక్కతేల్చారు. ఇందులో వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులే. ఇతర శాఖలకు చెందిన వారు 200 మంది మాత్రమే. ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందికి రెండు రోజుల వేతనం కోత విధించాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు జారీ చేసే ముందు సరైన కసరత్తు చేయకపోవడంతో విధులు నిర్వర్తించిన వారూ... అప్పటికే సెలవులో ఉన్నవారికి కూడా నోటీసులు వచ్చాయి. తాము డ్యూటీలు చేసినా నోటీసులు రావడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అధికారులను ఆశ్రయించారు. ఎవరెక్కడ విధులు నిర్వర్తించారో, ఎవరికి ఎక్కడ డ్యూటీలేశారో అనే విషయంలో అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. దీంతో ఉద్యోగుల నుంచి వివరణలు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరైన వారి మీదే చర్య లు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో నిర్ధిష్ట కారణాలతో విధులకు రాని వారికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఎన్నికల ప్రకటనకు ముందే సెలవులో ఉన్నవారు, రెండు డ్యూటీలు వచ్చినవారు, ప్రసూతి సెలవులో ఉన్నవారు, తల్లిపాలు తాగే శిశువులున్న వారు, విదేశాల్లో ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు సోమవారం వరకు సమయం ఇచ్చారు. సరైన కారణాలతో విధులకు దూరంగా ఉన్నవారిని మినహాయించి మిగతావారి రెండు రోజుల వేతనాన్ని ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. కానీ, గడువు పూర్తి కాకముందే కేసులు పెట్టాలని ఆదేశించడం పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బాధ్యులను వదిలి వేధింపులా ?
విధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని వదిలి, తమను వేధించడం ఏమిటని విధులు నిర్వర్తించిన వారు వాపోతున్నారు. విధులకు హాజరైనా డుమ్మా కొట్టారని నివేదికలు ఇచ్చిన వారిని, ఒకరికే రెండు చోట్ల డ్యూటీలు వేసిన వారినీ ఉపేక్షించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పొరపాట్ల ద్వారా ఎన్నికల నిర్వహణను తేలికగా తీసుకున్న అధికారుల మీద ఏ చర్యలు తీసుకుంటారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేతన కోతతోపాటు కేసులు నమోదు చేయాలన్న యోచన కూడా ఉన్నందున తమ భవిష్యత్తుతో ఆటలాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గైర్హాజరైన ఉపాధ్యాయుల విషయంలో వ్యవహరించినంత కఠినంగా మిగతా శాఖల ఉద్యోగుల పట్ల వ్యవహరించడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా నోటీసులు ఇచ్చినట్టు పేర్కొంటున్నారు.
Advertisement