- పన్నుల వాటాలో 60% విడుదల
- వినియోగ పత్రాలు ఇవ్వనందునే ఇబ్బందులు అంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా 1వ తేదీన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రాకపోవడంపై ఆర్థికశాఖ విస్మయం వ్యక్తం చేస్తోంది. ప్రతినెలా రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.1,760 కోట్ల నిధులు వస్తాయి. అలాగే రెవెన్యూ లోటు భర్తీ కింద మరో రూ.450 కోట్లు వస్తాయి. ప్రతి నెలా కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడే ఉద్యోగులకు జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే ఈ నెల 1న పన్నుల వాటా రూపంలో రావాల్సిన నిధుల్లో కేవలం 60 శాతమే వచ్చాయి. రూ.1,760 కోట్లకు గాను కేవలం రూ.977 కోట్లే విడుదల చేసింది. పన్నుల వాటా నిధులు ఇలా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా నిలిపివేయడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఉండగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా 1న రెవెన్యూ లోటు భర్తీ కింద విడుదల చేస్తున్న రూ.450 కోట్లను కూడా కేంద్రం ఈ నెల విడుదల చేయలేదు.
ఆగస్టులో పైసా రాలేదు
ఇలా ఉండగా గత ఆగస్టు 17న రాజధానిలో భవనాల నిర్మాణం కోసం, ఏడు వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధుల్లో ఇప్పటివరకు పైసా రాలేదని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో రాజధానిలో భవనాల నిర్మాణాల నిమిత్తం ఇచ్చిన రూ.1,050 కోట్లకు రాష్ట్రం ఇప్పటివరకు వినియోగ పత్రాలను సమర్పించలేదని, దీంతో ఆగస్టులో మంజూరు చేసిన నిధుల్లో పైసా కూడా కేంద్రం విడుదల చేయలేదని సమాచారం. ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చిన రూ.700 కోట్లకు వినియోగ పత్రాలు సమర్పిస్తే గానీ ఆందుకు మంజూరు చేసిన రూ.350 కోట్లు వచ్చే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర నిధుల్లో కోత
Published Thu, Nov 3 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement
Advertisement