-తమిళ కూలీలపై కాల్పుల ఘటనపై నిరసన
- కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల కమిషన్‌కు వినతి
- 'మే 17 మానవ హక్కుల సంఘం' వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుపతి, శేషాచలం అడవుల్లో 20 మంది తమిళ కూలీలను ఎన్‌కౌంటర్ చేసి చంపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేలా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌కు 'మే 17 మానవ హక్కుల సంఘం'(తమిళనాడు) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాలు.. ప్రస్తుతం జరుగుతున్న ఐరాస మానవ హక్కుల కమిషన్ సమావేశాలకు 'మే 17 మానవ హక్కుల సంఘం' సమన్వయకర్త తిరుమురుగన్ గాంధీ హాజరై తమిళనాడు సమస్యలను ప్రస్తావించారు.
తమిళనాడుకు చెందిన 20 మంది కూలీ కార్మికులు తిరుపతి సమీపం శేషాచలం అడవుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అటవీశాఖ అధికారుల చేతుల్లో హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మూడు ప్రభుత్వ శాఖల పాత్ర ఉందని సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి హెచ్ సురేష్ నాయకత్వంలో ఏర్పడిన నిజ నిర్ధారణ కమిటీ ఆరోపించిందని పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఆయన ఐరాస దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
మృతుల శరీరాల్లో గొంతు, ఆ పైభాగాల్లో తూటాలు ఉన్నందున వారిని దగ్గర నుంచే కాల్చి చంపినట్లుగా రుజువైందని, ఇంకా ఎంతో మంది తమిళ కూలీలు పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లి మాయం అయిపోతున్నారని పేర్కొన్నారు.జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫారసు చేసినా ఏపీ ప్రభుత్వంపై విచారణ చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగాలేదని విమర్శించారు.