ఉద్యోగుల డీఏకు ఆర్థిక శాఖ కొర్రి! | The Department of Finance employees no pay for da | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల డీఏకు ఆర్థిక శాఖ కొర్రి!

Published Mon, Apr 28 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

ఉద్యోగుల డీఏకు  ఆర్థిక శాఖ కొర్రి!

ఉద్యోగుల డీఏకు ఆర్థిక శాఖ కొర్రి!

రాష్ట్ర విభజన సాకుతో ఫైలును గవర్నర్‌కు పంపని అధికారులు
గవర్నర్ జోక్యం చేసుకుని డీఏ ఇవ్వాలని కోరుతున్న ఉద్యోగులు

 
 హైదరాబాద్: రాష్ట్రంలో 15 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం (డీఏ) ఫైలు ఆర్థిక శాఖలో గింగిర్లు తిరుగుతోంది. రాష్ట్ర విభజనను సాకుగా చూపుతూ ఓ అధికారి ఈ ఫైలు గవర్నర్‌కు చేరకుండా అడ్డుపడుతున్నారని ఉద్యోగవర్గాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నుంచి జూన్ వరకు డీఏ మంజూరైన విషయం తెలిసిందే. కేంద్రం మంజూరు చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ఉద్యోగులకు కూడా డీఏ మంజూరు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో డీఏపై నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరే. అయితే ఆ ఫైలును గవర్నర్‌కు పంపించకుండా ఆర్థిక శాఖ అధికారులు తమ సెక్షన్లలోనే తిప్పుకుంటున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో కరువు భత్యం మంజూరు చేయకూడదని ఆర్థిక శాఖలోని ఒక ముఖ్యకార్యదర్శి కొర్రీ వేసినట్లు సమాచారం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగులకు డీఏ ఇవ్వడం సాధారణంగా జరిగేదే. ఇందుకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిస్తారు. అయినా ఆర్థిక శాఖలో ఒక ముఖ్యకార్యదర్శి మాత్రం డీఏ మంజూరుకు మోకాలడ్డుతున్నట్లు ఉద్యోగవర్గాలు ఆరోపిస్తున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు మంజూరు చేయాల్సిన కరువు భత్యంను వెంటనే ఇవ్వకుండా రాష్ట్ర విభజన తర్వాతే ఇస్తామనడం అన్యాయమని పేర్కొంటున్నాయి. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకొని డీఏ మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మే నెల జీతాలు, పింఛన్లను అదే నెల 24వ తేదీనే మంజూరు చేస్తున్న తరహాలోనే డీఏ కూడా ముందుగా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement