
అంతా నిరాశ
- ఆశ కార్యకర్తలకు అన్ని విధాలా అన్యాయం
- అతి తక్కువ వేతనాలతో బతుకు కష్టాల మయం
- నెలల తరబడి బకాయిలతో సతమతం
అనారోగ్యం తీవ్రతరమై అవస్థలు పడుతున్న వేళ.. వారు కారు చీకట్లో కాంతి రేఖలా ఆదుకుంటారు. వేదన తగ్గించడానికి చేతనైన రీతిలో సాయపడతారు. విభిన్న బాధ్యతలను సహనంతో నిర్వహి స్తూ మన్యంలో రోగులకు భరోసా ఇస్తారు. నిరాశామయ వాతావరణంలో పని చేస్తున్న అశ కార్యకర్తలు కష్టాలను భరిస్తూనే సేవాభావానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించకపోగా, ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని సైతం నెలల తరబడి ఎగవేస్తూ ఉండడంతో ఉసూరని కాలం గడుపుతున్నారు.
పాడేరు, న్యూస్‌లైన్ : వైద్యం అరుదైన చోట వారు ఆశా కిరణాలుగా నిలుస్తున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్య సేవలు చేస్తూ బాధితులకు స్వాంతన కలిగిస్తున్నారు. సాటి గిరిజనులకు నిత్యం ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ గిరిజన గూడేల్లో గుండె దిటవు కల్పిస్తున్నారు. వివిధ రీతుల్లో అండగా నిలుస్తున్న ఆశ కార్యకర్తలు మాత్రం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్నా కనీస వేతనాలు కూడా అందక అలమటిస్తున్నారు. ఆ గౌరవ వేతనం సైతం నెలనెలా అందని దుస్థితిలో దుర్భర జీవనం గడుపుతున్నారు. రోజు కూలీ కూడా కిట్టుబాటు కాకపోయినా గ్రామం దాటకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏజెన్సీలోని 11 మండలాల్లోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో 3200 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. అలాగే సబ్‌ప్లాన్ మండలాలైన గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లిలలోని గిరిజన గ్రామాల్లో 2595 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరికి ఐటీడీఏ నెలకు రూ. 400, ప్రోత్సాహకంగా వైద్య ఆరోగ్యశాఖ రూ. 400 అందజేస్తున్నాయి. నెలకు రూ. 800 గౌరవ వేతనంతోనే వీరు పని చేస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.1500కు పెంచుతామని గతంలో అధికారులు ప్రకటించినా ఇప్పటికీ అది ఆచరణ సాధ్యం కాలేదు.
తక్కువ వేతనాలే సమస్య అనుకుంటే.. అవి కూడా సకాలంలో రాక ఆశ కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాడేరు ఐటీడీఏ గత ఏడాది జూలై నెల నుంచి గౌరవ వేతనాలను పంపిణీ చేయలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే వేతనాలు కూడా నాలుగు నెలలుగా చెల్లించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలని ఎన్ని సార్లు ఆందోళన చేపట్టినా ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు లేక సంక్రాంతికి కూడా సతమతమయ్యామని బాధ పడుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆశ కార్యకర్తలకు న్యాయం చేయాల్సి ఉంది.