భువనగిరి, న్యూస్‌లైన్: జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఐదేళ్లుగా మంజూరు చేసిన బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ (బీఆర్‌జీఎఫ్) వినియోగంపై సామాజిక తనిఖీలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఏటా రూ.42 కోట్ల చొప్పన 5 ఏళ్లపాటు మంజూరైన నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేశారు. 2008 నుంచి ఈ నిధుల వినియోగం ప్రారంభమైంది. దీనిలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ప్రతి ఏడూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. నిధుల వినియోగంపై సామాజిక తనిఖీలు చేయాలని నిర్ణయించింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గ్రామ పంచాయతీ ఆదాయ వనరులపై ఈ నెల 10, 11వ తేదీల్లో హైదరాబాద్‌లో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిం చింది.
ఇందులో బీఆర్‌జీఎఫ్ నిధుల వినియోగంపై జరిగిన చర్చలో పలు అంశాలను పంచాయతీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్న నిధులు, పనుల ప్రగతి తదితర వివరాలను సంపూర్ణంగా సేకరించి నివేదికలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పనులను ప్రజా ప్రతినిధులు నామినేషన్ పద్దతిన చేపట్టడంతో నిధులు దుర్వినియోగం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనులు విషయంలో ఆయా శాఖల అధికారుల తీరుపైన అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా డిసెంబర్ నుంచి ఈ సామాజిక తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.
నిధుల పంపకం, ఖర్చు ఇలా..
బీఆర్‌జీఎఫ్ నిధులను నూతన భవన నిర్మాణాలు, సీసీ రోడ్లు, లింక్ రోడ్లు పాఠశాల, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. అలాగే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి వినియోగించారు. జిల్లాకు మంజూ రైన రూ.42 కోట్ల నిధుల్లో గ్రామ పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌కు 30, జిల్లాపరిషత్‌కు 20 శాతం నిధులను కేటాయించారు. ఇలా ఐదు సంవత్సరాల్లో రూ.210 కోట్లు మంజూరయ్యాయి. అయితే మొదటి సంవత్సరంలో మున్సిపాలిటీకు మంజూరు చేయలేదు. ఆ తర్వాత జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు ఒక్కో సంవత్సరం కోటి రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు కేటాయించారు.
తనిఖీల కోసం ప్రత్యేకాధికారులు
బీఆర్‌జీఎఫ్ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీల కోసం ఒక ప్రోగ్రాం డెరైక్టర్‌ను నియమిస్తారు. ఈయన ప్రతి గ్రామం నుంచి ఇద్దరిని ఎంపిక చేసుకుని సామాజిక తనిఖీలపై శిక్షణనిస్తారు. శిక్షణ తీసుకున్న వారు గ్రామసభలు నిర్వహించి ఆయా గ్రామాల్లో బీఆర్‌జీఎఫ్ కింద ఎన్ని నిధులు మంజూరయ్యాయి.. ఎన్ని పనులు జరిగాయి, పనులు ఎందుకు నిలిచిపోయాయి, ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా? అన్న వివరాలు ప్రజలను అడిగి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచి పనుల్లో అక్రమాలపై విచారణ జరుపుతారు. గ్రామస్థాయి, మండలస్థాయి సమావేశాల్లో ప్రత్యేక అధికారులు వచ్చి నిధులపై విచారణ జరుపుతారు.
లెక్క..తేలాల్సిందే!
Published Sun, Oct 20 2013 3:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement