అభివృద్ధి సమానంగా జరగాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఆత్కూరు (గన్నవరం): పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని, అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు అన్ని సదుపాయాలతో పూర్తిగా అభివృద్ధి చెందితే, గ్రామాల్లో మాత్రం సరైన రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, డ్రెయిన్లు వంటి కనీస సదుపాయలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేవారు.
ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు పట్టణాలతో పాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చదువుకునే రోజుల నుంచి సమాజ సేవ చేయాలని తనతో పాటు తన స్నేహితులు భావించినా వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. 16 ఏళ్ల కిందట మిత్రులందరం చర్చించుకుని స్వర్ణభారత్ ట్రస్టును వెంకటచలంలో ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడలో ఎక్కువగా ఉన్న తన మిత్రుల కోరిక మేరకు ఏడాది కిందట ఇక్కడ చాప్టర్‌ను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నట్లు తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యధనుష్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి ట్రస్టు ద్వారా చేస్తున్న విభిన్న కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.