
విద్యుత్‌షాక్ తో రైతు మృతి
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు వేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి షాక్‌కు గురై రైతు..
యర్రగొండపాలెం టౌన్: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు వేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి షాక్‌కు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని గంగపాలెంలో సోమవారం జరిగింది. గ్రామంలోని దక్షిణం వైపున్న పొలాల్లో హెచ్‌టీలైన్ ట్రాన్స్‌ఫారం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీంతో గ్రామానికి చెందిన రైతు మాగులూరి కోటయ్య (35) ట్రాన్స్‌ఫారం వద్ద ఫీజు పోవడాన్ని గుర్తించి సరిచేస్తుండగా..విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. విద్యుత్ సిబ్బంది ఎల్‌సీ ఇచ్చారని, అందువల్లనే మరమ్మతులు చేసేందుకు కోటయ్య విద్యుత్ స్తంభం ఎక్కినట్లు గ్రామంలోని రైతులు తెలిపారు. హెల్పర్లు అందుబాటులో ఉండకపోవడంతో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కోటయ్యను తీసుకెళ్లి మరమ్మతులు చేయించుకునే వారమని రైతులు తెలిపారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణ చర్యలు చేపట్టకపోవడంతో, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు తమ పంటలను కాపాడుకునే ప్రయత్నంలో ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని వాపోతున్నారు. మృతునికి భార్య వరలక్ష్మి, తల్లిదండ్రులు ఉన్నారు. అందరికీ సహాయంగా ఉండే కోటయ్య విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఎల్‌సీ ఇచ్చారు కదా, మళ్లీ సరఫరా ఎలా ఇచ్చారని ఈ సంఘటనపై వైపాలెం ట్రాన్స్‌కో ఏఈ రాజును రైతులు ప్రశ్నించారు. ఎల్‌సీ ఇవ్వలేదని, అసలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కడంతో కోటయ్య ప్రమాదానికి గురయ్యాడని ఆయన తెలిపారు.
గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాయం ఏర్పడినప్పుడు కచ్చితంగా విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై ముక్కంటి సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతికి గల కారణాలు పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యాధికారి పీ చంద్రశేఖర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.