తొలి అడుగు..
♦ ఏయూలో ఐఐఎం ప్రారంభం
♦ తొలిరోజే తరగతులు బోధన
♦ 60మంది విద్యార్థులు చేరిక
♦ కొత్తకేంపస్‌లో నవ్యోత్సాహం
ఏయూక్యాంపస్ : చిరకాల స్వప్నం సాకారం అయ్యింది. విశాఖ వేదికగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రారంభమైంది. సో మవారం ఏయూలోని చారిత్రక ఎంబిఏ విభాగం ఎదురుగా ఐఐఐఎం(వి) తొలి అడుగును వేసింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేలకావడంవల్లనో, అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన విశాఖ ప్రత్యేకతో విద్యార్థులను, తల్లిదండ్రులను మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది. నిర్ధారిత సమయంలో పూర్తిచేసి, చక్కని వసతులతో దర్శనమిచ్చింది. సోమవారం ఉదయం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు.
నగరం నడిపించింది: విశాఖ నగర ఖ్యాతికి ఐఐఎంవి అదనపు సంపదగా నిలచింది. ఐఐఎం బెంగళూరుతో సమానంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు మన విశాఖ ఐఐఎంను ఎంపిక చేసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయంగా ఇది నిలవనుంది. అరవై మంది విద్యార్థులకు అవకాశం ఉండగా 54 మంది చేరారు. వీరిలో నలుగురు విద్యార్థినులున్నారు. భౌగోళికంగా నగరానికి ఉన్న ప్రాధాన్యత, ఏయూలో ఏర్పాటవుతుండటం కలసివచ్చాయని ఐఐఎం బెంగళూరు ఆచార్యులు స్వయంగా చెప్పారు. నూతనంగా ఏర్పాటవుతున్న సంస్థలో వసతులు, బోధన ఏర్పాట్లపై అనేక సందేహాలు ఉంటాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ విద్యార్థులో తెగువతో ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రా రంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏయూ ఇన్‌గేట్ వద్ద నున్న ఐఐఎంవి క్యాంపస్‌కు విద్యార్థులు చేరుకున్నారు. తొలిరోజు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు వెంట వచ్చారు. దీనితో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రాంగణం నిండిపోయింది.
{పారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరువాత తరగతులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 7 గంటల వరకు తరగతులు నిర్వహించారు.
శాశ్వత అధ్యాపకులు నియమితులయ్యే వరకు ఐఐఎం బెంగళూరు నుంచి అధ్యాపక బృందం బోధనకు వస్తుంటారు. సౌరవ్ ముఖర్జీ(డీన్) విశాఖ కేంద్రానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఐఐఎం బి నుంచి పలువురు ఆచార్యులు ఇక్కడకు చేరుకున్నారు.
ఐఐఎం బెంగళూరుకు చెందిన
సీనియర్ విద్యార్థుల బృందం సైతం ఇక్కడకు చేరుకుంది. విద్యార్థులకు విభిన్న అంశాలపై వీరు అవగాహన కల్పిస్తున్నారు. అల్యూమినీ విద్యార్థులు సైతం సమన్వయం చేస్తున్నారు. ఇక్కడ చేరిన విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనకు సైతం చర్యలు ప్రారంభించినట్లు ఐఐఎం బి సంచాలకులు సుశీల్ వచాని తెలిపారు.
ప్రతిభే కొలమానం....
ఐఐఎంలలో ప్రతిభే కొలమానంగా ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ఎంటర్‌ప్యూనర్, స్టార్టప్‌లపై ప్రాధాన్యం కల్పించడం జరుగుతుంది. సుశిక్షితులైన బోధన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వైజాగ్ ఐఐఎం భవిష్యత్తులో అత్యుత్తమ సంస్థల సరసన నిలుస్తుంది. విదేశాలలో స్థిరపడాలనే వారు ఇతర దేశాలలో ఎంబిఏకు వెళుతున్నారు.
-సుశీల్ వచాని, సంచాలకులు ఐఐఎం బెంగళూరు
వసతులు బాగున్నాయి...
కొత్త క్యాంపస్ అయినప్పటికీ వసతులు బాగున్నాయి. ఐఐఎంబి మెంటార్‌గా వ్యవహరించడం మంచి పరిణామం. అకడమిక్ హాల్స్, సెమినార్ హాల్స్ చాలా బాగున్నాయి. సీనియర్స్, అల్యూమిని అందిస్తున్న గెడైన్స్ ఎంతో సహకరిస్తోంది. ప్రస్తుతం సిఆర్‌గా వ్యవహరిస్తున్నాను.
-అంకిత్‌గుప్తా, మధ్యప్రదేశ్
ఆలోచనలకు మించి పోయింది..
నేను ఇప్పటికే దేశంలోని పలు ఐఐఎంల ఫోటోలను చూశాను. వీటన్నింటికంటే విశాఖ ఐఐఎం బాగుంది. మా ఆలోచనలు, ఆకాంక్షలను మించే విధంగా దీనిని తయారుచేశారు. ఐఐఎం బెంగళూరు నిపుణులు పడిన కష్టం కనిపిస్తోంది. ఇటువంటి సంస్థలో ప్రవేశం రావడం ఆనందంగాా ఉంది.
-మనీష్, చెన్నై