
మాజీ ఎమ్మెల్యే అల్లూరి కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, కార్మిక నాయకుడు, రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి వెంకటరామరాజు మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, కార్మిక నాయకుడు, రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి వెంకటరామరాజు మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన 1952, 1955లలో రాజోలు నుంచి కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1918లో అంతర్వేదిపాలెంలో జన్మించారు.
కాకినాడ రూరల్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కార్మిక నాయకుడు, రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి వెంకటరామరాజు మంగళవారం అర్ధరాత్రి కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో మృతి చెందారు. వెంకటరామరాజు కమ్యూనిస్టు పార్టీ తరఫున 1952, 1955లో రాజోలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1918లో రాజోలు మండలం అంతర్వేది పాలెంలో వ్యవసాయ కుటుంబీకులు నరసింహరాజు, లక్ష్మినరసమ్మలకు జన్మించిన వెంకటరామరాజు చిన్నతనం నుంచి ప్రజల తరపున పోరాడేవారు.
ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ తదితర ఆందోళనల్లో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారు. 1936-37లో రాజోలు తాలూకా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. 1938లో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. బ్రిటిష్ పాలనలో భారత కమ్యూనిస్టు పార్టీని నిషేధించిన సమయంలో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాజోలు మండలం అంతర్వేది పాలెంలో ప్రెస్‌ను ఆయన ఎంతో ధైర్యసాహసాలతో నడిపారు. పార్టీ రహస్య పత్రిక ‘స్వతంత్ర భారత్’ను కోనసీమ అంతటా పంపిణీ చేయడంలో వెంకట రామరాజు కీలకపాత్ర పోషించారు. 1947లో ప్రకాశం ఆర్డినెన్స్ మేరకు రాయవెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు.
1948-49లో ప్రభుత్వం నిర్బంధకాండ అమలు జరపడంతో రహస్య జీవితం గడిపారు. 1951 ఆగస్టులో ప్రభుత్వ మరోసారి వెంకటరామరాజును అరెస్టు చేసి రాయవెల్లూరు, కడలూరు జైళ్లలో నిర్బంధించింది. వెంకటరామరాజు ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై రైతు సమస్యలపై పోరాటం చేశారు. 1964లో ఉధృతంగా సాగిన అదనపు భూమి శిస్తు వ్యతిరేక సత్యాగ్రహంలో వెంకటరామరాజు పాల్గొన్నారు. 1964 ఉంచి 1968 వరకు జిల్లా కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా పనిచేశారు. కంట్రోల్ కమిషన్ సభ్యునిగా, రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శిగా, వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ప్రజాశక్తి దినపత్రిక ప్రారంభించేందుకు నాలుగున్నర ఎకరాల భూమిని అమ్మి విరాళంగా అందజేశారు.
తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని విక్రయించి పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణాలకు అందజేశారు. వెంకటరామరాజు 25 ఏళ్లుగా సర్పవరంలో నివాసం ఉంటున్నారు. మామిడితాండ్ర తయారీదారులు, కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వెంకటరామరాజు భార్య సుందరమ్మ గత ఏడాది మృతి చెందారు. ఈయనకు ఒక కుమారుడు విశ్వనాథరాజు, ఇద్దరు కుమార్తెలు ఝూన్సీలక్ష్మి, భారతి ఉన్నారు. కుమారుడు విశ్వనాథరాజు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్టుమెంటులో పనిచేసి పదవీవిరమణ పొందారు.
పలువురు సంతాపం
మాజీ ఎమ్మెల్యే అల్లూరి వెంకటరామరాజు మృతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు టి.మధు, కిర్ల కృష్ణారావు, చెల్లుబోయిన కేశవశెట్టి, వైడీ రామారావు, చిరంజీవినీ కుమారి, చిట్టూరి ప్రభాకరచౌదరి, సర్పవరం సర్పంచ్ బొండాడ విజయ, ఉపసర్పంచ్ పుల్ల శ్రీరాములు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.