సంక్షోభంలో వైద్యం! | The healing crisis! | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో వైద్యం!

Published Thu, Jan 22 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

సంక్షోభంలో వైద్యం!

సంక్షోభంలో వైద్యం!

నెల్లూరు(అర్బన్): వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న సుమారు 40 మంది డాక్టర్లు ఒక్కసారిగా బదిలీ కానున్నట్లు సమాచారం. నగరంలోని డీఎస్‌ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, రేబాల చిన్న పిల్లల ఆస్పత్రి, జూబ్లీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రిల్లో పనిచేస్తున్న 40 మంది డాక్టర్లను పరిషత్ ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ నిమిత్తం బుధవారం హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు.

దీంతో వీళ్లు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పై ఆస్పత్రులు డీఎంసీ (డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆధీనంలోకి వెళ్లాయి. దీంతో ఇక్కడ పనిచేసే డాక్టర్లు కాలేజీలో పాఠాలు చెబుతూ, రోగులకు చికిత్సనందించాలి. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రుల్లో పరిషత్ కింద పనిచేస్తున్న డాక్టర్లలో అర్హులను తీసుకోగా, మిగిలిన వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
రోగులకు తప్పని అవస్థలు
డాక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించుకోవడంతో ఆస్పత్రుల్లో రోగులకు తిప్పలు తప్పలేదు. డీఎస్‌ఆర్, రేబాల, జూబ్లీ, టీబీ ఆస్పత్రులకు రోజూ వేలసంఖ్యలోజిల్లా నలుమూలన నుంచి రోగులు వస్తుంటారు. డాక్టర్లు లేకపోవడంతో బుధవారం వీరంతా ఇబ్బందులు పడ్డారు. మెడికల్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని చెప్పారు. అయితే కొంతమంది మాత్రమే డీఎస్‌ఆర్‌కి వెళ్లి రోగులకు చికిత్సనందించారు.
 
బోధనా.. చికిత్స? ఎటూతేలని వైనం
ఇదిలా ఉండగా 40 మంది వైద్యులు హైదరాబాద్‌కు వెళ్తున్న నేపథ్యంలో డీఎస్‌ఆర్ ఆస్పత్రి ఉన్నతాధికారులు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని డ్యూటీలు వేశారు. అలాగే కొంతమంది కాలేజీ సిబ్బందిని ఆ ఆస్పత్రుల పర్యవేక్షణ కోసం నియమించారు. అయితే దీనిని కాలేజీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము పాఠాలు చెప్పేందుకు వచ్చామని, చికిత్స చేసేందుకు కాదని కొంతమంది డాక్టర్లు అధికారుల వద్ద తెగేసిచెప్పినట్లు తెలిసింది.

సిబ్బంది తాము కాలేజీ వ్యవహారాలు చూసుకుంటూ మిగతా పనులు చేయాలంటే పెనుభారం అవుతుందని చెప్పినట్లు సమాచారం. బదిలీల కౌన్సెలింగ్ కోసం వెళ్లిన డాక్టర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీ డాక్టర్లు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరని, తమను ఉన్నట్టు ఉండి బదిలీ చేయడం సబబు కాదని అంటున్నారు. పరిషత్ ఉన్నతాధికారులు ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా డాక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తంగా రోగుల పాలిట శాపంగా మారిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement