ఆ.. ఎలుకలే కదా!
కేవీఆర్‌లో పందికొక్కులు
రెండు రోజుల్లో తొమ్మిదిమంది ఆసుపత్రిపాలు
పాములు, ఎలుకలతోవిద్యార్థుల అవస్థలు
హాస్టల్ చుట్టూఅపరిశుభ్ర వాతావరణం
నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నఅధికారులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ హాస్టల్ వసతి ఉండడంతో మహిళల విద్యాభ్యాసానికి అనుకూలంగా భావిస్తారు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ వరకు చదువుకునే వీలుంది. ఈ కారనంగా గ్రామీణ విద్యార్థినులు దాదాపుగా ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. 2015-16 విద్యా సంవత్సరంలో 1,100 మంది విద్యార్థినులు ఈ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. అయితే హాస్టల్‌లో అధికారులు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాన్‌టీచింగ్ స్టాఫ్ ఇష్టారాజ్యం సాగుతోంది. అసలే హాస్టల్ భవనం పాతది కావడం.. దీనికి తోడు పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఎలుకలు, పందికొక్కులు, పాముల సంచారం అధికమైంది. ముఖ్యంగా ఎలుకల బెడద అధికమవడంతో విద్యార్థినులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. మూడు రోజుల క్రితం ఎలుకలు కొరకడంతో 9 మంది విద్యార్థినులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు.
బుధవారం 5గురు, గురువారం నలుగురు ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందారు. వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో ఎలుకల సమస్యతో చదువుపై దృష్టి సారించలేని పరిస్థితికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థినులు ప్రిపరేషన్ హాలిడేస్ పేరిట సొంతూళ్లకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిని అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలుకలు ఎవరిళ్లలో లేవంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా విద్యార్థినులే హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లేదనే సాకులతో సరిపుచ్చుతున్నారు.
గోడ కూలి ఏడాది
హాస్టల్ భవనాల సమీపంలోని కేసీ కెనాల్ వైపున్న గోడ కూలి ఏడాది గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయించేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాత్రిళ్లు బయటి వ్యక్తులు లోపలికి వస్తున్నారనే చర్చ జరుగుతోంది. హాస్టల్‌కు సమీపంలోనే సారా తయారీ ప్రాంతమైన బంగారుపేట ఉండటంతో మందుబాబుల సంచారం ఈ ప్రాంతంలో అధికంగా ఉంటోంది. అయినప్పటికీ విద్యార్థినుల భద్రతను అధికారులు గాలికొదిలేశారు.
ఎవరింట్లో ఎలుకలు ఉండవు
ఎలుకలు ఎవరింట్లో ఉండవు. అందరిండ్లలో ఉంటాయి. హాస్టల్‌లో కూడా అంతే. విద్యార్థినులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలేదు. అందువల్లే ఎలుకల సంచారం అధికమైంది. విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం నా దృష్టికి రాలేదు - పురుషోత్తమరెడ్డి, ప్రిన్సిపాల్