బెల్లంపల్లి : ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు. మూడు ట్రా క్టర్ల ఇసుక.. రూ.ఆరు వేలు అన్న చందంగా దందా సా గుతోంది. కొందరు కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ల యజమాను లు బెల్లంపల్లి, కాసిపేట, నె న్నెల, వేమనపల్లి, బెల్లంపల్లి, భీమిని, తాండూర్ మండలాల్లోని వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు.
తవ్వకాల కేంద్రాలివీ..
వేమనపల్లి శివారులోని ప్రాణహిత నది, కొత్తపల్లి వాగు, నీల్వాయి వాగులో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. నెన్నెల మండలంలో కుమ్మరివాగు, మెట్‌పల్లి వాగు, నందులపల్లి వాగులో, తాండూరు మండలంలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో ఉన్న వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వేస్తున్నారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి, శాంతిఖని, గురిజాల, పెర్కపల్లి, బట్వాన్‌పల్లి, చాకెపల్లి, చంద్రవెల్లి, చర్లపల్లి శివారులలోని అటవీ ప్రాంతం నుంచి, ప్రభుత్వ స్థలాల్లోని వాగుల నుంచి ఇసుకను తీసుకెళ్తున్నారు. భీమిని మండలం కన్నెపల్లి, జజ్జరవెల్లి, రాంపూర్, కాసిపేట మండలం పెద్దనపల్లి, దేవాపూర్ వాగుల నుంచి భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. నెన్నెల మండలంలో ట్రాక్టర్ లోడ్‌కు రూ.500, వేమనపల్లిలో రూ.600, కాసిపేటలో రూ.800, తాండూర్‌లో రూ.1,200, భీమినిలో రూ.800, బెల్లంపల్లిలో రూ.1800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తుండడంతో ఎప్పటికప్పుడు ధర పెరుగుతోంది. ఇసుక అక్రమ తరలింపుపై సుప్రీంకోర్టు నిషేధం ఉండడంతో కొందరు అవినీతి అధికారుల పంట పండుతోంది. ప్రతీ నెల కొంత మొత్తం ముట్టజెప్పడానికి ట్రాక్టర్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇసుక తవ్వేస్తున్నారు..
Published Sun, Oct 26 2014 4:43 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement