తోడేస్తున్నారు
- జిల్లాలో ఇసుకాసుర రాజ్యం
- వట్టిపోతున్న వాగులు
- దట్టమైన వనాల్లో నిరంతర దందా
- మాఫియూకు కొమ్ముకాస్తున్న అధికారులు
- అందినకాడికి దండుకుంటున్న పలువురు
- నిరుపయోగంగా మారిన వాల్టా చట్టం
సాక్షి, హన్మకొండ: అడవులకు ప్రాణాధారంగా ఉండే వాగుల్లోంచి ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు. నడవడానికి కష్టం గా ఉండే దట్టమైన అడవుల్లో ఇప్పుడు నిర్విరామంగా ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణాతో అటవీప్రాంతాల్లోని వాగులు... ఇ సుక లేకుండా గోతులతో దర్శనమిస్తున్నాయి. భూపాలపల్లి చుట్టూ విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇసుక మా ఫియూ యథేచ్ఛగా రెచ్చిపోతోంది. నీరు-భూమి-చెట్ల పరిరక్షణ (వాల్టా) చట్టం సాక్షిగా వాగులన్నీ వట్టిపోతున్నా యి. దీ న్ని అరికట్టాల్సిన అటవీశాఖ అధికారులు... ఇసుకాసురుల కు కొమ్ముకాస్తున్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల అ దికారు లు పలువురు కళ్లుమూసుకుని ఈ అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగేందుకు తమవంతు సాయమందిస్తున్నారు.
అయ్యో అడవీ...
సింగరేణి బొగ్గు గనులు ఉన్న భూపాలపల్లి పట్టణం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ పట్టణ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భూపాలపల్లి చుట్టూ వరంగల్ ఉత్తరం, కరీంనగర్ తూర్పు విభాగాల పరిధిలో వందల హెక్టార్ల పరిధిలో అడవి విస్తరించి ఉంది. ఇందులో వరంగల్ ఉత్తరం విభాగంలో మల్లంపల్లి, పెద్దాపూర్, కమలాపూర్ గ్రామాల పరిసరాల్లో ఉన్న దట్టమైన అటవీప్రాంతాల గుండా బొగ్గులవాగు, తీగలవాగులు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా... కరీంనగర్ తూర్పు విభాగం పరిధిలో జంగేడు, కాసంపల్లి సమీపంలోని అడవుల్లో వడ్లోని వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులన్నీ ఒకప్పుడు నీటిప్రవాహంతో ఇసుక మేటలతో నిండిఉండేది. కానీ.. కొద్దికాలంగా ఎడాపెడా ఇసుకను తోడేయడంతో ఈ వాగుల్లో ఇసుక మేటలు కనుమరుగయ్యాయి. నీరు పూర్తిగా అడుగంటి పోయింది.
40 ట్రాక్టరు.. 250 ట్రిప్పులు
బొగ్గులవాగు, తీగలవాగుల్లో ఇసుకను తోడేందుకు నిత్యం 30 ట్రాక్టర్లు తిరుగుతున్నారుు. వీటి ద్వారా రోజుకు సగటున 180 ట్రిప్పుల ఇసుకను అటవీ ప్రాంతం నుంచి తోడేస్తున్నారు. వడ్లోనివాగులో ఇసుకను తోడేందుకు మరో 10 ట్రాక్టర్లు రోజంతా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారుు. వీటి ద్వారా రోజుకు వంద ట్రిప్పుల ఇసుకను వాగులో నుంచి భూపాలపల్లికి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం దసరా పండుగ జరిగే అక్టోబరులో మొదలై మళ్లీ జూన్ వరకు సాగుతూ ఉండడం పరిపాటిగా మారింది. ఇలా ఎనిమిది నెలలపాటు భూపాలపల్లి కేంద్రంగా నిత్యం 40 ట్రాక్టర్లు సగటున రోజుకు 250 ట్రిప్పులు తిరుగుతూ ఉన్నట్లు అంచనా.
పారిశ్రామిక అవసరాలే పెట్టుబడి...
భూపాలపల్లి పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతుండడంతో నిర్మాణ రంగం ఇక్కడ జోరుమీదుంది. ఒకవైపు సింగరేణి సంస్థ కార్మికులకు పెద్ద ఎత్తున నివాస స్థలాలు నిర్మిస్తుండగా... మరోవైపు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటికి అదనంగా సొంత నిర్మాణాలు ఉండనే ఉన్నాయి. ఫలితంగా గడిచిన కొన్నేళ్లలో భూపాలపల్లిలో ఇరవైకి పైగా యాష్‌బ్రిక్, సిమెంట్ బ్రిక్ తయారీ సంస్థలు వెలిశాయి. ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా ఈ యాష్‌బ్రిక్ సంస్థలు నిలుస్తున్నాయి.
అటవీశాఖపై అనుమానాలెన్నో...
భూపాలపల్లి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను రక్షించేందుకు వరంగల్, కరీనంగర్ అటవీశాఖల పరిధిలో రెండు రేంజ్ కార్యాలయాలున్నాయి. బీట్ ఆఫీసర్ నుంచి ఫారెస్ట్ రేంజర్ వరకు ఒక్కో విభాగంలో కనీసం 35 మంది సిబ్బంది వంతున రెండు డివిజన్లకు సంబంధించి 75 మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు గస్తీ తిరిగేందుకు ఆరు వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ సిబ్బందికి ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కనిపించదు. తమ కళ్లెదుటే వాల్టా చట్టానికి తూట్లు పడుతున్నా పట్టించుకోరు. దీనికంతటికీ ముడుపుల మాయూజాలమే కారణమని తెలుస్తోంది.
పలువురు అటవీ శాఖ అధికారులకు ఇసుకాసురుల నుంచి ఒక్కో ట్రాక్టరుకు రూ.పది వేల వంతున నెలకు రూ.నాలుగు లక్షలు అందుతున్నట్లు సమాచారం. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సైతం ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో ట్రాక్టరుకు రూ.ఐదువేల వంతున రెవెన్యూ, శాంతిభద్రతల విభాగాలకు చెందిన సిబ్బందికి నెలకు రూ. రెండు లక్షలు సమర్పించుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు అ అంశాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.