నీటిని తరలిస్తే కేసులు ‘ఇసుక’తో కాసులు
♦ ఇసుకను తరలిస్తే కేసుల్లేవట..
♦ అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలు
పుల్‌కల్ : ప్రజల దాహం తీర్చేందుకు మంజీరా నది నుంచి నీటిని తరలిస్తే అధికారులపై సైతం క్రిమినల్ కేసులు పెడతామంటున్న అటవీశాఖ అధికారులు అదే నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడంలేదు. అటవీశాఖ అధికారులు ఒక సందర్భంలో నీటిని తరలిస్తే కలెక్టర్‌పైనా కేసులు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. మండల పరిధిలోని పోచారం, చక్రియాల్, హోన్నపూర్ సత్యసాయి నీటి పథకం ద్వారా జిల్లాలోని 275 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
మంజీరలో నీరు అడుగంటి పోవడంతో వన్య ప్రాణాలు సంరక్షణకై ఉన్న నీటిని పంపింగ్ చేయవద్దని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుకుల నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ తాగునీటి అవసరాల కోసం పంపింగ్ చేస్తున్నారు. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు వెంటనే పంపింగ్‌ను నిలిపివేయాలని లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో అవసరమైతే కలెక్టర్‌పై కూడా కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంత వరకు బాగానే ఉన్నా ఇదే మంజీరా నదిలో అక్రమంగా ఇసుకను రవాణ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల అవసరాల కోసం తాగు నీటిని సరఫరా చేస్తున్న సత్యసాయి వాటర్ సప్లయి కార్మికులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. సింగూర్‌లో రాత్రి వేళ్లలో నది నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకవచ్చి గ్రామంలోని పొలాల వద్ద నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై తహశీల్దార్ శివరాంను వివరణ కోరగా ఆర్‌ఐతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.