అసాంఘిక కార్యకలాపాలను అణచివేసేందుకు ఎస్పీ చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ఆ శాఖ సిబ్బందే నీరుగారుస్తున్నారు. ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.. తక్షణ చర్యలు తీసుకుంటాననే రఘురామిరెడ్డి మాటలకు విలువ లేకుండా చేస్తున్నారు. న్యాయం దేవుడెరుగు.. ఫిర్యాదు చేసినం దుకు బాధితులే బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.
కర్నూలు, న్యూస్‌లైన్: ఫ్యాక్షన్ ఖిల్లాగా పేరొందిన కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు మీతో మీఎస్పీ అనే వినూత్న కార్యక్రమానికి ఎస్పీ రఘురామిరెడ్డి ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన శ్రీకారం చుట్టారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను మూడు రోజుల్లో సంబంధిత పోలీసుస్టేషన్ సిబ్బంది బాధితులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఎంతో సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అమలులో క్షేత్ర స్థాయి అధికారులు కొందరు మామూళ్ల మత్తులో నిర్లక్ష్యం చేస్తున్నారు.
ప్రతి వారం ఫోన్ ద్వారా బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించవచ్చనేది ఎస్పీ భావన. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారమిచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్వయంగా ప్రకటించడంతో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
అయితే క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు ఫిర్యాదుదారుల పేర్లను బయటపెడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. రుద్రవరం మండలం ఆలమూరులో పాఠశాల, దేవాలయం సమీపంలోనే మద్యం షాపు ఉండటంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వీరి వివరాలు స్థానిక పోలీసులు బయటపెట్టడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నట్లు సమాచారం. కల్లూరు మండలం తడకనపల్లెలో రాముడి గుడి పక్కనే పాఠశాల వద్ద బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేమడూరు గ్రామంలో బస్టాండు వద్దనున్న దేవాలయం సమీపాన మద్యం బెల్టు దుకాణం ఉంది. గ్రామస్తులు మీతో మీ ఎస్పీకి ఫిర్యాదు చేసినా క్షేత్ర స్థాయి అధికారులు పెడచెవిన పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బెల్టు దుకాణాల నిర్వాహకులతో మామూళ్లు దండుకుంటున్న కొందరు పోలీసు అధికారులు వీటిని నిర్మూలించేందుక ఎంతమాత్రం ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పెద్దకడుబూరు మండలం బసాపురం గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపు విషయమై గ్రామస్తులు గత అక్టోబర్ 18న ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామంలో మహిళల మరుగుదొడ్డి పక్కనే బెల్టు దుకాణం నడుస్తోంది. మందుబాబులు అక్కడే గంటల తరబడి ఉండటం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో బెల్టు షాపులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రెండుసార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా అడ్డుకట్ట పడలేదు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో మద్యం దుకాణాల ఎదుట మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని మహిళలు ఫిర్యాదు చేసినా అటకెక్కింది.
స్థానిక పోలీసులు పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన నాయకుడు ఒకరు నాటుసారా వ్యాపారం సాగిస్తున్నట్లు నవంబర్ 15న ఎస్పీకి ఫిర్యాదు అందినా అటువైపు సిబ్బంది కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదు. జిల్లా కేంద్రానికి రాలేక సమస్యలతో సతమతమయ్యే మహిళలు, వృద్ధుల కోసం ఎంతో ఉన్నతాశయంతో ఎస్పీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి అధికారుల అలసత్వంతో అభాసుపాలవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని ‘మీతో మీ ఎస్పీ’ ఫిర్యాదులపై స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘బెల్టు’ లేస్తోంది!
Published Fri, Dec 20 2013 4:20 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement