పాలకుల పాపం కంగుందికి శాపం
దుర్భర జీవనం గడుపుతున్న ప్రజలు
నాటి పాలకుల తప్పిదాలు.. నేటి ప్రజాప్రతినిధులు, మండల అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామాల పాలిట శాపంగా మారింది. ఉన్నది తమిళనాడులో.. పాలన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో. దీంతో ఆ ఊర్లలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలంటే ఏమిటో తెలియ దు. ఆ పల్లెలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. విద్య కరువు. అరకొరగా చదివిన వారికి స్థానికత సమస్య. చివరకు వారిలో 95 శాతం మందికి తెలుగు రాదు. ఇదీ కుప్పం నియోజకవర్గంలోని కంగుంది పంచాయతీ దుస్థితి.
కుప్పంరూరల్: కుప్పం నియోజకవర్గంలోని రిజర్వ్ ఫారెస్టు వెనుక తమిళనాడు సరిహద్దులో కంగుంది పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలో బ్రహ్మదేవరచేన్లు, తరగవాని మూల, వెంకటరాపురం, గొల్లపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ పల్లెల్లో సుమారు 2500 మంది జనాభా ఉంది. ఈ ఊర్లు తమిళనాడుకు ఆనుకుని, ఆంధ్రాకు విసిరేసినట్లు దూరంగా ఉన్నా యి. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రేషన్, పింఛన్లు తదితర సౌకర్యాలు అందడం లేదు. మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పాల కులు, అధికారులు చేసిన తప్పిదాలతోనే ఈ నాలుగు గ్రా మాల ప్రజలను అష్టకష్టాలు పడుతున్నారు. అప్పుట్లో ఈ గ్రామాలు తమిళనాడులోనే కలిపి ఉంటే నేడీ సమస్యలు వచ్చేవి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మండల కేంద్రానికి 45 కిలో మీటర్ల దూరం
కంగుంది పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన కుప్పం పట్టణానికి రావాలంటే 25 కిలో మీటర్ల దూరం తమిళనాడులో ప్రయాణించిన అనంతరం అక్కడ బస్సు మారి మరో 20 కిలో మీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంది. కంగుంది రిజర్వు ఫారెస్టు వెనుక తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఇంత దూరం ప్రయాణం తప్పడం లేదు. గతంలో బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ రోడ్డు సక్రమంగా లేకపోవడం, కలెక్షన్ల పేరిట సర్వీసు రద్దు చేశారు. మండల కేంద్రం రావాలంటే తమిళనాడు బస్సులు, ఆటోలే శరణ్యం. ఒక వ్యక్తి బ్రహ్మదేవరచేన్లు నుంచి కుప్పం రావాలంటే రూ. 60 నుంచి 70 రూపాయలు వెచ్చించాల్సి ఉంది.
వెక్కిరిస్తున్న ప్రభుత్వ పథకాలు
నిరక్ష్యరాస్యులు, కూలీలే అధికంగా ఉన్న ఈ గ్రామాలకు సంవత్సరానికి ఒక మారు అయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. విద్యుత్ రీడింగ్‌ల కోసం ఒక రెస్కో లైన్‌మెన్ మాత్రం నెల మొదటి వారంలో ఒక రోజు వెళుతుంటాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలైన పెన్షన్లు, రేషన్‌కార్డులు, పాసుపుస్తకాలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు ఒక్కటేమిటి ప్రతీది ఈ గ్రామాల ప్రజలకు అందక వెక్కిరిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, కాపు లోన్లు అంటే ఏమిటవని ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్యం విషయానికి వస్తే గ్రామాల్లో ఎక్కడా కాలువలు, సిమెంట్ రోడ్లు గానీ లేకపోవడంతో వీధుల్లో నడవ లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో ఎక్కడ వెతికినా ఒక మరుగుదొడ్డి గానీ, గ్యాస్ ఉన్న ఇల్లు గానీ కనిపించదు. ఉపాధి హామీ పనులు అయితే మొదట్లో ఒకటి రెండు పనులు ఇచ్చారు, ప్రస్తుతం దాని జాడే లేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలు నగరాలకు వలసపోక తప్పడం లేదు.
విద్యార్థులను వేధిస్తున్న స్థానికత
కంగుంది పంచాయతీలోని నాలుగు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ప్రాథమిక విద్య బ్రహ్మదేవరచేన్లులో అభ్యసించవచ్చు. ఆ తరువాత ఉన్నత పాఠశాల కోసం తమిళనాడులోని నారాయణపురం, కళాశాల చదువులకు వాణియంబాడిని ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడ వారికి స్థానికత సమస్య ఎదురవుతోంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు దొరకని సందర్భాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి నిత్యం 120 మంది విద్యార్థులు నడక దారిన రాకపోకలు సాగిస్తూ చదువులు కొనసాగిస్తున్నారు. చదువులు పూర్తి చేసుకున్న వారికి కూడా వారు ఉపాధి పొందడానికి నాన్‌లోకల్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎదురవుతుండడంతో కొంత మంది పాఠశాల దశలోనే చదువులు మాన్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు రాయడం, చదవడం, చివరకు 95 శాతం మందికి తెలుగు మాట్లాడడం రాకపోవడం కొసమెరుపు.
మా గ్రామాలను తమిళనాడులో కలపండి
కుప్పంకు వెళ్లిరావాలంటే బస్సు లు, ఆటోలు అయితే రూ.70, ద్విచక్రవాహనంలో అయితే 120 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదయం బయలుదేరితే తిరిగిరావడానికి సాయంత్రం పడుతుంది. మా ఊళ్ల కు ఏసారు రారు. దయవుంచి మమ్మల్ని తమిళనాడులో కలపండి అదే పదివేలు. -పెరుమాళ్, బ్రహ్మదేవరచేన్లు
ఏ ప్రభుత్వ పథకమూ అందదు
ఏ ప్రభుత్వ పథకమూ అందడం లేదు. ప్రభుత్వాస్పత్రికి రావాలంటే 45 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంది. రోడ్లు, ఆస్పత్రి నిర్మిస్తే మీకు పుణ్యం ఉంటుంది. - చిన్నతాయి, బ్రహ్మదేవరచేన్లు