మేయర్ కాని మేయర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సొమ్మొకరిది.. సోకొకరిది అనే చందంగా మారింది నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి. ప్రజాస్వామ్య బద్ధంగా మేయర్ అబ్దుల్ అజీజ్ అయితే.. అప్రజాస్వామికంగా టీడీపీ నేత, కార్పొరేటర్ జెడ్ శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అందుకు మంగళవారం 11వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వెలసిన బ్యానర్లే నిదర్శనం. వార్డులో వెలసిన ఆ బ్యానర్లను చూసిన నగర ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఔరా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు.
అనూహ్యంగా ఏర్పాటు చేసిన పచ్చ బ్యానర్‌ను చూసి టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కార్పొరేటర్‌గా విజయం సాధించి మేయర్ పీఠాన్ని అధిష్టించిన అబ్దుల్ అజీజ్ టీడీపీ నేతల ప్రలోభాలకులోనై పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. టీడీపీలో చేరిన నాటి నుంచి మేయర్ అజీజ్‌కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ జోక్యం చేసుకుని పార్టీ శ్రేణులు మేయర్ అజీజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఒకరకంగా హుకుం జారీ చేశారు.
అయినా తమ్ముళ్ల తీరు మారకపోవడంతో మంత్రి నారాయణ ఇటీవల టీడీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నుంచి చేరిన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి సమక్షంలోనూ మేయర్ అజీజ్‌ను లెక్కచేయకుండా విమర్శలు చేశారు. టీడీపీలోని ఓ వర్గం మంత్రి మాటనూ పెడచెవిన పెట్టింది. కొద్దిరోజులకు అంతా సర్దుకుంటుందని భావిం చారు. అయితే అటువంటిదేదీ జరక్కపోవటంతో రోజురోజుకూ కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో మేయర్ అజీజ్ జన్మభూమి కార్యక్రమాల్లో పెద్దగా హాజరుకాకుండా దూరంగా ఉంటున్నారు.
అడుగడుగునా అవమానం
నగరంలో మంగళవారం 11వ వార్డులో నెల్లూరు మేయర్ జడ్ శివప్రసాద్ అని పేర్కొంటూ బ్యానర్ ఏర్పాటు చేసి ఉండటంతో అటు టీడీపీలోనూ.. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లలో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం తాము ఏ పార్టీలో ఉన్నామో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
‘అనుకున్నదొకటి.. జరిగేదొక్కటి’ అన్నచందంగా మారటంతో ‘పార్టీ మారినందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం’ అని ఓ కార్పొరేటర్ మంగళవారం తన వర్గీయుల వద్ద ఆందోళన వ్యక్తం చేయటం కనిపించింది. మేయర్‌గా పీఠాన్ని అధిష్టించిన అబ్దుల్ అజీజ్ నగరంలో చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులోభాగంగా పొడి చెత్తను వేరు చేసి వేలం నిర్వహించాలని, వచ్చిన ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నారు.
అలాగే తడిచెత్తను మినీ డంపింగ్‌యార్డుకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించి తద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని భావించారు. అదేవిధంగా నగరంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వీటి అమలును టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ రెండు కార్యక్రమాలు అటకెక్కినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా మేయర్ వార్డుల్లో పర్యటించాలని భావించారు.
అందుకు కొందరు అధికారులు సహకరించకపోవటం.. ఆయా వార్డుల్లోని టీడీపీ కార్పొరేటర్లు నిరాకరించటంతో ఆ కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు. టీడీపీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు నగరపాలక సంస్థ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు అధికారులు, కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి మేయర్ అజీజా? జడ్ శివప్రసాదా? అని టీడీపీ శ్రేణులు చర్చించుకోవటం కనిపించింది.